స్మాల్ క్యాప్ ఫండ్స్ లో.. తగ్గుతున్న చిన్న కంపెనీల వాటా

స్మాల్ క్యాప్ ఫండ్స్ లో.. తగ్గుతున్న చిన్న కంపెనీల వాటా

హైదరాబాద్​, వెలుగు: స్మాల్​క్యాప్ మ్యూచువల్​ఫండ్లలో మైక్రోక్యాప్  కంపెనీల వాటా కేవలం అత్యల్పంగా ఉంటోందని వెంచురా సంస్థ స్టడీ రిపోర్ట్​  వెల్లడించింది.  మనదేశంలో 32 మ్యూచువల్ ఫండ్  పథకాలు ఇలాంటి కంపెనీలలో పెట్టుబడులు పెడుతున్నాయి. గత నవంబర్ నాటికి ఈ పథకాలు ప్రజల నుంచి సేకరించిన మొత్తం విలువ సుమారు రూ.3.7 లక్షల కోట్లు. వీటిలో మైక్రోక్యాప్​ కంపెనీల వాటా రెండు శాతం కూడా మించలేదు.

 అంటే ప్రతి వంద రూపాయలలో రెండు రూపాయలు మాత్రమే అతి చిన్న కంపెనీల వైపు వెళ్తున్నాయి. మిగిలిన పెట్టుబడి అంతా కాస్త నమ్మదగ్గ స్థాయిలో ఉన్న చిన్న కంపెనీలలోనే ఉంది. దీనివల్ల పెట్టుబడిదారులకు రిస్క్ తక్కువగా ఉంటుంది.  స్టాక్ మార్కెట్లో  టాప్​–1000 కంటే తక్కువ ర్యాంకులో ఉండే అతి చిన్న కంపెనీలను మైక్రో క్యాప్ కంపెనీలు అంటారు.  

మార్కెట్ విలువ పరంగా స్మాల్ క్యాప్ కంపెనీల కంటే ఇవి కింద ఉంటాయి. గడచిన ఐదేళ్లలో వీటి మార్కెట్ విలువ 4 నుంచి 7 రెట్లు పెరిగింది.  మిడ్ క్యాప్ కంపెనీలుగా భావించే ఏంజిల్ వన్, టాటా కెమికల్స్, జిల్లెట్ వంటి ప్రముఖ కంపెనీలు కూడా ఏఎంఎఫ్​ఐ వర్గీకరణ ప్రకారం స్మాల్ క్యాప్ విభాగంలోనే ఉన్నాయి.