ఇమ్రాన్​కు బెయిల్​పై తీర్పు రిజర్వ్

ఇమ్రాన్​కు బెయిల్​పై తీర్పు రిజర్వ్
  •     అల్లర్ల కేసులో లాహోర్ కోర్టు నిర్ణయం
  •     వేరే కేసుల్లో వచ్చే నెల 8 వరకు బెయిల్​

లాహోర్/ఇస్లామాబాద్: పాకిస్తాన్  మాజీ ప్రధాని ఇమ్రాన్  ఖాన్  బెయిల్  పిటిషన్​పై తీర్పును లాహోర్  హైకోర్టు రిజర్వు చేసింది. అవినీతి కేసులో గత వారం ఇమ్రాన్  అరెస్టయ్యారు. ఇమ్రాన్ అరెస్టును నిరసిస్తూ పంజాబ్  ప్రావిన్సులో ఆయన మద్దతుదారులు ఆందోళనలు చేశారు. ప్రభుత్వ వాహనాలు, భవనాలను ధ్వంసం చేశారు. దీంతో పంజాబ్ ప్రావిన్సులో ఇమ్రాన్ పై పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో బెయిల్  ఇవ్వాలని కోరుతూ ఈ నెల 13న ఇమ్రాన్ మరో  పిటిషన్  దాఖలు చేశారు. మంగళవారం ఈ పిటిషన్​పై లాహోర్ హైకోర్టు విచారణ జరిపింది.

అయితే ఈ విచారణకు ఇమ్రాన్ హాజరు కాలేదు. పంజాబ్ ప్రభుత్వ అడ్వొకేట్.. ఇమ్రాన్ బెయిల్ పిటిషన్​ను వ్యతిరేకించారు. ఆయనకు బెయిల్  ఇవ్వకూడదని కోరారు. అయితే, తన క్లయింట్ ముందస్తు అరెస్ట్​ను అడ్డుకోవడానికి బెయిల్ కోరుతున్నారని, ప్రొటెక్టివ్  బెయిల్  కాదని ఇమ్రాన్  అడ్వొకేట్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నారు. ఈ కేసును లార్జర్  బెంచ్​కు పంపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పంజాబ్  ఇన్ స్పెక్టర్  జనరల్,  అడ్వొకేట్  జనరల్​ను ప్రతివాదులుగా ఇమ్రాన్  తన పిటిషన్ లో చేర్చారు. వాదనలు విన్న తర్వాత లాహోర్  హైకోర్టు ఈ పిటిషన్​పై తీర్పును రిజర్వు చేసింది. కాగా.. హింసను రెచ్చగొట్టారని, దేశద్రోహానికి పాల్పడ్డారని ఇమ్రాన్​పై నమోదైన కేసుల్లో ఆయన బెయిల్ గడువును ఇస్లామాబాద్  హైకోర్టు జూన్  8 వరకు పొడిగించింది. ఈ నెల 9 తర్వాత ఇమ్రాన్ పై నమోదైన కేసుల్లో ఆయనను అధికారులు అరెస్టు చేయకుండా ఇస్లామాబాద్  కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

చీఫ్​ జస్టిస్​పై విమర్శలు

ఇమ్రాన్​ను పోలీసులు సుప్రీంకోర్టులో హాజరు పరిచిన సందర్భంలో.. మాజీ ప్రధానిని చూసి సీజే ఉమర్ అతా బండియాల్ ‘మిమ్మల్ని చూడడం సంతోషంగా ఉంది’ అని పలకరించారు. దీనిపై అధికార పార్టీ నేతలు విమర్శలకు దిగారు. దీంతో బండియాల్  మంగళవారం స్పందించారు. కోర్టు ఆచారాల్లో భాగంగానే ఇమ్రాన్​ను పలకరించానని ఓ మీడియా సంస్థకు ఆయన వెల్లడించారు.