బాలీవుడ్ వెటరన్ యాక్టర్ రతన్ చోప్రా (70) మృతి

బాలీవుడ్ వెటరన్ యాక్టర్ రతన్ చోప్రా (70) మృతి

న్యూఢిల్లీ: బాలీవుడ్ వెటరన్ యాక్టర్ రతన్ చోప్రా (70) క్యాన్సర్‌‌తో బాధపడుతూ పంజాబ్‌లోని మాలెర్‌‌కోట్లా టౌన్‌లో చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవార రాత్రి రతన్ చోప్రా మృతి చెందారని ఆయన దత్తత కూతురు అనిత తెలిపారు. తన తండ్రి క్యాన్సర్‌‌తో పోరాడుతూ చనిపోయాడని ఆమె చెప్పారు. ట్రీట్‌మెంట్‌కు ఆయన దగ్గర డబ్బులు కూడా లేవన్నారు. రతన్ చోప్రా పెళ్లి చేసుకోలేదు. పది రోజుల క్రితం బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్రతోపాటు స్టార్‌‌ హీరో అక్షయ్‌ కుమార్‌, సోనూ సూద్‌ను ఆర్థిక చేయూతను అందించాల్సిందిగా రతన్ చోప్రా సంప్రదించాడని సమాచారం. కానీ వారి దగ్గరి నుంచి ఎలాంటి రిప్లయి రాలేదని తెలిసింది. ఈ ఏడాది జనవరిలో రతన్ చోప్రాకు క్యాన్సర్ ఉన్నట్లు బయటపడింది. ఆయన తన చివరి రోజుల్లో పేదరికంలో బతికాడని తెలిసింది. లోకల్ గురుద్వారాలు, టెంపుల్స్‌ డొనేట్ చేసే ఫుడ్‌ను ఆయన తినేవాడని సమాచారం. గత కొన్నేళ్లుగా హర్యానా, పంచకులలోని ఓ అద్దె గదిలో రతన్ ఉంటున్నాడు.

తనూజా హీరోయిన్‌గా నటించగా.. 1972లో రిలీజ్ అయిన ‘మోమె కీ గుడియా’ సినిమాలో రతన్‌ చోప్రా లీడ్ రోల్‌లో కనిపించాడు. అయితే తన గ్రాండ్ మదర్ ఫిల్మ్స్‌ కెరీర్‌‌ వద్దని వారించడంతో ఆయన ఇండస్ట్రీని వదిలేశారు. ఆ తర్వాత పంజాబ్‌లోని పలు స్కూళ్లు, ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఇంగ్లీష్ పాఠాలు బోధించారు. లోఫర్, ఆయా సావన్ ఝూమ్ కే, జుగ్నూ మూవీస్‌లో యాక్ట్ చేయాల్సిందిగా తనకు ఆఫర్స్ వచ్చాయని.. అయితే గ్రాండ్ మదర్ వద్దనడంతో నటించలేదని రీసెంట్‌గా చోప్రా చెప్పారు. రతన్ చోప్రా వదులుకున్న సదరు ఫిల్మ్స్‌లో నటించే ఆఫర్‌‌ను ధర్మేంద్ర దక్కించుకున్నాడు.