ప్రజల నోళ్లలో నానుతున్న ధార్మిక పదం వీహెచ్​పీ

 ప్రజల నోళ్లలో నానుతున్న ధార్మిక పదం వీహెచ్​పీ

విశ్వహిందూ పరిషత్..ఈ పేరు ఇటీవల కాలంలో ప్రపంచ దేశాల్లోని ప్రజల నోళ్లలో నానుతున్న ధార్మిక పదం. అయోధ్య రామ జన్మభూమి కేసు సుప్రీం కోర్టులో విజయం సాధించిన 2019 నవంబర్ 9 నుంచి మొన్నటి రామమందిర నిర్మాణ భూమిపూజ 2020 ఆగస్టు 5 నాటికి అందరి మదిలో మెదిలి, చర్చకు మూలమైంది వీహెచ్​పీ. 1964 లో శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజు ఆర్ఎస్ఎస్ రెండో చీఫ్ మాధవ సదాశివ గోల్వాల్కర్(గురూజీ) నేతృత్వంలో ముంబై మహానగరంలోని సాందీపని ఆశ్రమంలో విశ్వహిందూ పరిషత్ పురుడుపోసుకుంది. 

అనేక సంఘర్షణలు, ఆందోళనలు, నిర్మాణాత్మక కార్యక్రమాలతో దేశ వ్యాప్తంగా విస్తరించింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)కు అనుబంధంగా ఉంటూ ధార్మిక సామాజిక సేవా రంగాల్లో వీహెచ్ పీ కార్యకలాపాలు విస్తరించింది. దాదాపు17 ప్రధాన విభాగాల్లో హిందూ జీవన విధానంపై ప్రపంచానికి అవగాహన కల్పిస్తున్నది. 1983లో ప్రతిష్టాత్మకంగా ‘ఏకాత్మక యజ్ఞం’ నిర్వహించింది. సామాజిక సమరసతా భావం నింపేందుకు అంటరానివారు, దళితులు అనే భావన పక్కకు పెట్టి ‘సకల హైందవ జాతి ఒక్కటే’ అని చాటి చెప్పింది. సామాజిక దురాచారాలను రూపుమాపేందుకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక కార్యక్రమాలను రూపొందించింది.

మతం మార్చే కుట్రను తిప్పికొట్టి..
1981ల్లో తమిళనాడు కేంద్రంగా హిందువులను మతం మార్చే కుట్ర జరిగింది. ‘తిరువెళ్లి’ అనే గ్రామంలో దళిత సామాజిక వర్గానికి చెందిన దాదాపు180 పేద కుటుంబాల వారిని మతం మార్చారు. దళితులంతా హిందువులు కాదని హిందుత్వం దళిత వ్యతిరేకి అని అసత్యాలు నూరిపోసి ఆ సామాజిక వర్గాన్ని మొత్తం వేరే మతంలోకి మార్చేందుకు భారీ కుట్ర నడిచింది. 
రంగంలోకి దిగిన వీహెచ్ పీ దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టి సమస్యను ప్రజల్లోకి తీసుకు వెళ్లింది. ఈ విషయాన్ని పార్లమెంటులో లేవనెత్తి మతమార్పిడి మాఫియా కోరలు పీకింది. అప్పటి రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ స్పందించేలా చేసింది. ఈ ఘటన ఆధారంగా యావత్ హిందూ సమాజం జాగృతమై ఎక్కడికక్కడ ప్రతిఘటించే వాతావరణం దేశవ్యాప్తంగా ప్రారంభమైంది.

అయోధ్య ఉద్యమం
గ్రామ గ్రామంలో కరసేవకులు, రామ భక్తులను తయారుచేసి హైందవ వీరులను తీర్చిదిద్దింది వీహెచ్ పీ. 1985 డిసెంబర్ లో మందిర నిర్మాణం కోసం ‘రామజన్మ భూమి న్యాస్’ ఏర్పాటు చేసింది. జగద్గురు రామానందాచార్య, శివరామాచార్య మహారాజ్, అశోక్ సింఘాల్ వంటి ధార్మికవేత్తల నేతృత్వంలో లక్షలాది సాధుసంతులు, స్వయం సేవకులు ఉద్యమించారు. 
చివరకు సుప్రీంకోర్టులో 2019 నవంబర్ 9న అయోధ్యను సాధించిన ఘనత వీహెచ్ పీదే. 1975లో సత్య వ్రతంనిర్వహించింది. ఉమ్మడి ఏపీలో రెండుసార్లు తిరుపతి కేంద్రంగా 1985,1988 సంవత్సరాల్లో ‘హిందూ మహా సమ్మేళనాలు’ నిర్వహించింది. వాటిల్లో లక్షలాదిగా పాల్గొన్న హైందవ సోదరులు హిందూ సంఘటన కోసం ప్రతిజ్ఞ తీసుకున్నారు. 1975లో కర్నూలులో జ్ఞానపీఠంతోపాటు బాలబాలికల సంక్షేమం కోసం గిరిజన వికాస కేంద్రం ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా అనాథ ఆశ్రమాలు, ఆవాసాలు ఏర్పాటు చేసి, దిగ్విజయంగా నిర్వహిస్తోంది. గంగానది పవిత్రతను కాపాడాలని భారతమాత, గంగామాత యాత్ర నిర్వహించింది. 

దేశం నలుమూలల నుంచి ఆయా ప్రాంతాల్లోని నదుల నుంచి జలాలు తీసుకువచ్చి గంగలో కలిపి ప్రతిజ్ఞ చేసింది. గోమాత హిందువులకు ప్రత్యక్ష దైవం. అందుకే  గోసంతతిని కాపాడేందుకు బజరంగ్​దళ్ కార్యకర్తలు, అహర్నిశలు కృషి చేస్తున్నారు. సామాజిక అసమానతలు, ఆర్థిక పరిస్థితులు, నిరక్షరాస్యత, అవగాహన లోపంతో హిందూ సమాజంలోని చాలామంది ధర్మాన్ని వీడుతున్నారు. ‘ఘర్​వాపసీ’ కార్యక్రమంతో అలాంటి వారిని మళ్లీ స్వధర్మంలోకి ఆహ్వానిస్తోంది. 

ఆలయాల పవిత్రతను రక్షిస్తూ..
‘లవ్ జిహాద్’ వలలో చిక్కుకోకుండా అమ్మాయిలకు కాలేజీలు, విద్యాలయాల్లో అవగాహన కల్పిస్తూ, వారిని వారు రక్షించుకునే ఆత్మస్థైర్యాన్నిస్తోంది వీహెచ్ పీ. దేవాలయాల్లో జరిగే అక్రమాలు, అన్యాయాలను నిలదీస్తూ ఆలయాల పవిత్రతను కాపాడుతోంది. ప్రభుత్వం, పోలీసుల నుంచి వేధింపులు సైతం ఎదుర్కొని హిందూ సంఘటనం కోసం పని చేస్తోంది. కార్య విస్తరణలో వేలాదిమంది ‘పూర్తి సమయ కార్యకర్తలు’ వారి జీవితాలను దేశం కోసం, ధర్మం కోసం, పవిత్ర మనసుతో త్యాగం చేస్తున్నారు. -పగుడాకుల బాలస్వామి, రాష్ట్ర ప్రచార సహప్రముక్, విశ్వహిందూ పరిషత్.