మద్దతు ధర ఇస్తే రుణమాఫీ అవసరం లేదు

మద్దతు ధర ఇస్తే రుణమాఫీ అవసరం లేదు

రాజేంద్రనగర్, వెలుగు‘దేశంలో 50 శాతం మంది రైతులు బ్యాంకులు, ప్రైవేటు వ్యక్తులిచ్చే రుణాలపై ఆధారపడటం బాధాకరం. మద్దతు ధరిస్తే రుణమాఫీ అవసరం ఉండదు. నేనెప్పుడూ రుణమాఫీలకు వ్యతిరేకం. శాశ్వత మార్గాలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రాజేంద్రనగర్‌‌లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ‘కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీలు, పీజేటీఎస్‌‌ఏయూ’ కో ఆర్డినేషన్ ఆధ్వర్యంలో మూడ్రోజుల సదస్సు శనివారం ప్రారంభమైంది. ముఖ్య​అతిథిగా హాజరైన వెంకయ్య మాట్లాడుతూ.. సమాజంలో అన్ని వర్గాలూ ముందుకెళ్తున్నాయని, రైతులు మాత్రం అభివృద్ధి చెందడం లేదన్నారు.  వేరే దేశాలు మన వ్యవసాయ విధానాలతో మంచి ఉత్పత్తి, ఉత్పాదకత సాధిస్తుంటే మన దేశంలో వ్యవసాయం మాత్రం రోజురోజుకు గిట్టబాటు కావడం లేదన్నారు.

చాటింగ్‌‌, డేటింగ్‌‌ కాదు.. పొలంలకు పోవాలె

గిట్టుబాటు ధరలు రాని టమాట, ఆలూ వంటి పంటలను ఫుడ్ ప్రాసెసింగ్, వాల్యూ ఎడిషన్‌‌ వైపు మళ్లించాలని వెంకయ్య సూచించారు. డయాబెటిస్‌‌ను నియంత్రించే లక్షణాలున్న వరి సాగును ప్రోత్సహించాలన్నారు. స్టూడెంట్లు చాటింగ్, డేటింట్ మానుకొని 50 శాతం థియరీ, 50 శాతం పొలాల్లోకి వెళ్లి విజ్ఞానం సంపాదించుకోవాలని సూచించారు. నీటి పారుదలలో రాష్ట్ర ప్రభుత్వం మంచి పనితీరు కనబరుస్తోందని పొగిడారు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటుతో పాటు నీటి పారుదల రంగాలకు సీఎం కేసీఆర్‌‌ పెద్దపీట వేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌‌ రెడ్డి చెప్పారు.