ఆర్అండ్ఆర్​ ప్యాకేజీ ఇవ్వాలని బాధితుల నిరసన

ఆర్అండ్ఆర్​ ప్యాకేజీ ఇవ్వాలని బాధితుల నిరసన

చండూరు ( మర్రిగూడ) వెలుగు: చర్లగూడెం రిజర్వాయర్​లో భూములు కోల్పోయిన బాధితులు సీఎం కేసీఆర్ తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చి, ఆర్అండ్ఆర్​ ప్యాకేజీ ఇవ్వాలని ఆయన ఫొటోతో నిరసన చేపట్టారు. పునరావాసం కల్పించి న్యాయం చేయాలని కోరుతూ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన చర్లగూడెం, నర్సిరెడ్డిగూడెం, వెంకేపల్లి, వెంకేపల్లి తండా వాసులు మర్రిగూడ తహసీల్దార్​ఆఫీసు ఎదుట 45 రోజులుగా దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. శనివారం దీక్షా శిబిరంలో కుర్చీపై కేసీఆర్​ఫొటో పెట్టి తమకు న్యాయం చేయాలనే ప్లకార్డులతో నిరసన తెలిపారు.

ప్రాజెక్టు శంకుస్థాపన సమయంలో ప్రభుత్వమే ఇండ్లు కట్టించి పునరావాసం కల్పిస్తుందని కేసీఆర్ ఇచ్చిన హామీ ఇంకా నెరవేరలేదని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇండ్లు కోల్పోయిన వారికి స్ట్రక్చర్ ప్రకారం డబ్బులు ఇచ్చారని.. వాటితో ఒక అర్ర జాగా కూడా రాదన్నారు. ముంపు గ్రామాల ప్రజ‌‌ల‌‌కు ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని చెప్పిన సీఎం ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. మాకు నష్టపరిహారం పూర్తిస్థాయిలో చెల్లించకుంటే మునుగోడు ఉపఎన్నికల్లో తగిన బుద్ధిచెప్తామని హెచ్చరించారు.