గ్రేటర్ లో లక్షల ఓట్లు గాయబ్

గ్రేటర్ లో లక్షల ఓట్లు గాయబ్
  • ఓటరు ఐడీ ఉన్నా లిస్టులో మాయమైన పేర్లు
  • పోలింగ్‌‌ బూత్‌‌ల చుట్టూ ఓటర్ల చక్కర్లు
  •  ఆన్‌‌లైన్‌‌లో మాత్రమే కనిపిస్తున్న కొందరి వివరాలు
  • డివిజన్లలో అటూ ఇటూ మార్పులు
  • చనిపోయినోళ్ల పేర్లు ఉండి.. తమ పేర్లు లేకపోవడంపై ఆగ్రహం
  • పలుచోట్ల ఆందోళనకు దిగిన ఓటర్లు, పార్టీల కార్యకర్తలు
  • కావాలనే ఓట్లు తొలగించారని ఆరోపణలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌ మున్సిపల్‌‌‌‌ ఎలక్షన్లలో లక్షల ఓట్లు గల్లంతయ్యాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఓటరు ఐడీ ఉన్నా, ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో వివరాలు కనిపిస్తున్నా.. పోలింగ్‌‌‌‌ బూత్​లలోని లిస్టుల్లో ఓటర్ల పేర్లు కనిపించలేదు. మరికొన్నిచోట్ల ఓటర్లను ఒక డివిజన్​ నుంచి మరో డివిజన్​కు మార్చేశారు. పక్కపక్క ఇండ్లలోని వారి ఓట్లు కూడా వేర్వేరు డివిజన్ల లిస్టుల్లోకి వెళ్లిపోయాయి. అసలు లిస్టులో పేర్లు లేక, వేరే డివిజన్లలోకి మారిన విషయం తెలియక ఓటర్లు అయోమయానికి గురయ్యారు. కొన్ని చోట్ల ఓటర్లు, రాజకీయ పార్టీల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. చనిపోయినవారి పేర్లు కూడా ఓటర్​ లిస్టుల్లో ఉన్నాయని.. తమ పేర్లు గల్లంతయ్యాయని తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. కొందరు నేతల ఓట్లు కూడా గల్లంతు కావడం ఆసక్తిగా మారింది.

ఓటరు స్లిప్పులు పంచక..

సిటీ వ్యాప్తంగా మంగళవారం పొద్దున్నుంచీ కూడా పోలింగ్‌‌‌‌ మందకొడిగా సాగింది. అలా వచ్చిన కొందరు ఓటర్లకూ ఇబ్బందులు ఎదురయ్యాయి. చాలా డివిజన్లలో ఓటరు స్లిప్పులనే సరిగా పంపిణీ చేయలేదు. దాంతో తమ ఓట్లు ఉన్నాయో లేదో, ఉంటే ఏ డివిజన్, ఏ పోలింగ్​బూత్​ లోకి వెళ్లాయనేది ఓటర్లకు తెలియని పరిస్థితి నెలకొంది. పోలింగ్‌‌‌‌ బూత్‌‌‌‌ ల సమీపంలో పార్టీల వారీగా ఏర్పాటు హెల్ప్‌‌‌‌ డెస్క్‌‌‌‌ల వద్ద ఓటర్లు తమ స్లిప్పులను తీసుకున్నారు. ఈ టైంలోనే తమ పేర్లు ఓటర్​ లిస్టులో లేవని తేలడంతో ఆందోళన వ్యక్తం చేశారు. కొందరి విషయంలో డిలీటెడ్‌‌‌‌ అని ఉండగా.. మరికొందరి పేర్లు గల్లంతయ్యాయి. ఆయా ఓటర్ల దగ్గర ఉన్న ఓటర్​ ఐడీ కార్డుల నంబర్లను ఆన్​లైన్​లో ఎంటర్​ చేసి చూస్తే.. ఓటు ఉన్నట్టు చూపిస్తున్నాయి.  లిస్టులో మాత్రం కనిపించక గందరగోళం నెలకొంది.

పోలింగ్‌‌‌‌ బూత్‌‌‌‌ల చుట్టూ తిరిగినా..

ఆన్‌‌‌‌ లైన్‌‌‌‌లో ఓటరు డీటైల్స్‌‌‌‌ చూపిస్తుండటంతో పక్క బూత్‌‌‌‌ లలో ఓటు ఉండే చాన్స్​ ఉందని పార్టీల నేతలు ఓటర్లకు చెప్తూ వచ్చారు. దీంతో కొందరు ఓటర్లు వేరే ఇతర బూత్​లకు వెళ్లి లిస్టులో పేర్లు వెతికే ప్రయత్నం చేశారు. అలా రెండు మూడు చోట్ల వెతికినా పేర్లు కనబడక ఆవేదనకు లోనై.. తిరిగి ఇంటి బాట పట్టారు. కొన్నిచోట్ల కుటుంబంలో ఒకరిద్దరి ఓట్లు లిస్టులో ఉండగా.. మిగతావారి పేర్లు గల్లంతయ్యాయి. దీనిపై ఓటర్లతోపాటు ప్రతిపక్షాల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వంపై, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చనిపోయినవారి పేర్లను లిస్టుల్లోంచి డిలీట్‌‌‌‌ చేశారని కొందరు అధికారులు పేర్కొనగా.. ఓటర్లు మరింతగా మండిపడ్డారు.  కళ్లెదురే కనిపిస్తుంటే.. చనిపోయారని అంటారా? అని నిలదీశారు. అసెంబ్లీ ఎలక్షన్లలో ఓటేశామని.. ఇప్పుడెందుకు పేర్లు మాయమయ్యాయని ప్రశ్నించారు.

కావాలనే తొలగించారంటూ..

కొన్ని డివిజన్లలో ఓట్ల గల్లంతుపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. కావాలనే కొందరి ఓట్లను తొలగించారని ఆరోపించాయి. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు ఓటేయరనుకున్న వారి పేర్లను, ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించారని పేర్కొంటున్నాయి. ముఖ్యంగా పాతబస్తీ ప్రాంతంలోని పలు డివిజన్లలో హిందువుల ఓట్లు తొలగించారని బీజేపీ నేతలు ఆరోపించారు.

గల్లంతుపై కంప్లైంట్లెన్నో..

  •      జియాగూడ డివిజన్‌‌‌‌లోని పోలింగ్ బూత్–38లో 914ఓట్లకు గాను 657ఓట్లు గల్లంతయ్యాయి. దాంతో ఓటర్లు ఆందోళనకు దిగి, అధికారులను నిలదీశారు.
  •      లంగర్ హౌస్ బూత్ నంబర్-10లో 784 ఓట్లకు గాను 552 ఓట్లు గల్లంతయ్యాయి.
  •      భారతీనగర్ డివిజన్‌‌‌‌లోని స్లమ్ ఏరియాలో ఓట్లు గల్లంతయ్యాయని స్థానికులు ఆందోళన చేశారు.
  •      లిస్టు నుంచి తమ ఓట్లను డిలీట్​చేయడంపై కాప్రా, కుషాయిగూడ, చర్లపల్లి ప్రాంతాల నుంచి ఎలక్షన్​ కమిషన్​కు ఓటర్ల నుంచి కంప్లైంట్లు వచ్చాయి.
  •      జూబ్లీహిల్స్‌‌‌‌లో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఓటు గల్లంతైంది. దీనిపై ఆయన అధికారులకు ఫిర్యాదు చేశారు.
  •      పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట డివిజన్‌‌‌‌లో పలువురి ఓట్లు లిస్టులో లేకుండా పోయాయి.
  •      ఓటరు లిస్ట్‌‌‌‌లో పేరు లేకపోవడంతో సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఓటేయకుండా వెనక్కివెళ్లిపోయారు.
  •      పోలింగ్ స్లిప్పులు రాలేదని రాజేంద్రనగర్‌‌‌‌లో జనం ఆందోళనకు దిగారు.

నా ఓటు ఎట్ల పోయింది?

ఓటరు స్లిప్‌‌‌‌ కోసం ఓ పార్టీ హెల్ప్‌‌‌‌ డెస్క్‌‌‌‌ దగ్గరికి పోతే.. లిస్ట్‌‌‌‌లో పేరు లేదన్నరు. నా  ఓటరు ఐడీ కార్డులోని ఎపిక్‌‌‌‌ నంబర్‌‌‌‌ ఆన్‌‌‌‌ లైన్‌‌‌‌లో సెర్చ్‌‌‌‌ చేసి చూస్తే ఓటు ఉన్నట్టు చూపించింది. ఓటరు లిస్ట్‌‌‌‌లో పేరు లేదు. పక్క పోలింగ్‌‌‌‌ బూత్‌‌‌‌లో ఉందేమోనని పోయి చూసిన. లేదు. నా ఓటు ఎట్ల పోతది? అని అధికారులను అడిగితే చనిపోయిన వారి ఓట్లు డిలీట్‌‌‌‌ చేశారంటున్నరు. నేను బతికే ఉన్నకదా.. నా ఓటు ఎట్ల పోయింది.?

– భాగ్యలక్ష్మి, లంగర్​హౌజ్​ డివిజన్‌‌‌‌