
హైదరాబాద్, వెలుగు: దంపతులు విదేశంలో ఉన్నా, వారిలో ఒకరు వేరే దేశంలో ఉంటున్నప్పుడు వాళ్ల మధ్య విభేదాలొచ్చి కోర్టు మెట్లు ఎక్కితే, ఆ కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు జడ్జి జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు ఇటీవల తీర్పు ఇచ్చారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ అమ్మాయికి భర్తతో విభేదాలొచ్చాయి. దీంతో విడాకులు ఇప్పించాల్సిందిగా కోరుతూ ఆమె 2012లో హైదరాబాద్‌లోని కోర్టు మెట్లెక్కారు. అయితే భార్యతోనే కలిసి ఉంటానని ఏడాది తర్వాత ఆమె భర్త పిటిషన్ వేశాడు. ఆ రెండు పిటిషన్లనూ కోర్టు విచారిస్తోంది. దీనిపై అతడి భార్య అభిప్రాయాన్ని తెలుసుకోవాలని కోర్టు నిర్ణయించింది.
అమెరికాలో కొడుకుతో పాటు ఉంటున్న ఆమె రాకపోవడంతో వివాదం హైకోర్టుకు చేరింది. వచ్చి కోర్టులో వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే గతేడాది మార్చి 25న ఆమె హైదరాబాద్‌కు వచ్చింది. 21 రోజులు ఇక్కడే ఉంది. ఆమె వాంగ్మూలాన్ని వెంటనే నమోదు చేసి కేసు విచారించాలని, గడువు ముగిస్తే అధికారులు పాస్‌పోర్టును సీజ్ చేసే అవకాశముందని ఆమె తరఫు లాయరు కోర్టుకు విన్నవించారు. అయితే, కౌంటర్ వేయాల్సిందిగా కోర్టు ఆదేశించడంతో, దాని వల్ల లేట్ అవుతందని భావించిన ఆమె అమెరికా వెళ్లిపోయింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసును విచారించాలని పిటిషన్ వేశారు. ఇక్కడ ఆ చాన్స్ లేదని పేర్కొంటూ ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఆమె హైకోర్టుకు వెళ్లారు. దీంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసులను విచారించొచ్చని జస్టిస్ రామచందర్‌రావు తీర్పునిచ్చారు. గతంలో సింగ్, దేశాయ్ కేసులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసులను విచారించొచ్చన్న సుప్రీం కోర్టు తీర్పును గుర్తు చేశారు.