టొరంటో : క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌లో ఇండియా గ్రాండ్ మాస్టర్ విదిత్ సంతోష్ గుజరాతీ సంచలన విజయం సాధించాడు. అమెరికా స్టార్ హికారు నకామురాకు చెక్ పెట్టాడు. శనివారం జరిగిన ఓపెన్ సెక్షన్ రెండో రౌండ్‌లో విదిత్ (1.5 పాయింట్లు).. వరల్డ్ మూడో ర్యాంకర్ నకామురాను ఓడించాడు. వరుసగా రెండోసారి నల్ల పావులతో ఆడిన విదిత్ 29 ఎత్తుల వద్దే ప్రత్యర్థి ఆట కట్టించాడు.
మరో గేమ్‌లో ఆర్. ప్రజ్ఞానంద (0.5).. తోటి ఇండియన్ డి. గుకేశ్ (1.5) చేతిలో ఓటమిపాలయ్యాడు. విమెన్స్ స్టార్ ప్లేయర్ కోనేరు హంపి (1 పాయింట్) వరుసగా రెండో గేమ్‌ను డ్రా చేసుకుంది. కెటరైనా లాగ్నో (ఉక్రెయిన్)తో జరిగిన గేమ్‌ను 38 ఎత్తుల వద్ద డ్రాగా ముగించింది. మరో గేమ్‌లో ఆర్. వైశాలి (0.5).. జోంగై టాన్ (చైనా 2) చేతిలో ఓడిపోయింది.