- ఇండియా నుంచి బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై, న్యూఢిల్లీ, ముంబై నగరాలకు చోటు
- 2023 సంవత్సరానికి ర్యాంకులు విడుదల చేసిన ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన సిటీల జాబితాలో ఆస్ట్రియా రాజధాని వియన్నా నంబర్ వన్ గా నిలిచింది. ఈ మేరకు ‘ద ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) లిస్టును ప్రకటించింది. హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, సుస్థిరాభివృద్ధి, మౌలిక సౌకర్యాలు, పర్యావరణం వంటి అంశాల ఆధారంగా ప్రపంచంలోని 173 నగరాల పేర్లను అత్యంత నివాసయోగ్యమైన సిటీల లిస్టులో ఈఐయూ చేర్చింది. వియన్నా తర్వాత డెన్మార్క్ రాజధాని కోపెన్ హగెన్ రెండో స్థానం పొందింది. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్, సిడ్నీ మూడు, నాలుగో స్థానాల్లో నిలిచాయి.
కెనడా నుంచి కాల్గరి, వ్యాంకోవర్, టొరంటో ఐదు, ఆరు, ఏడు స్థానాలు పొందాయి. స్విట్జర్లాండ్ నుంచి జ్యూరిచ్ ఆరు, జెనీవా ఏడో స్థానంలో నిలిచాయి.జపాన్ లోని ఒసాకా పదో ప్లేస్ లో నిలిచింది. ఇక మన దేశం నుంచి బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబైకి లిస్టులో చోటు దక్కింది. ఢిల్లీ, ముంబై 141వ స్థానంలో.. చెన్నై 144వ ప్లేస్ లో నిలిచాయి. అహ్మదాబాద్, బెంగళూరుకు వరుసగా 147, 148 ర్యాంకులు దక్కాయి. యూకే క్యాపిటల్ లండన్, స్వీడన్ రాజధాని స్టాక్ హోం గతంలో 12, 22వ స్థానంలో నిలవగా ఈసారి వాటి ర్యాంకులు వరుసగా 46, 43కు పడిపోయాయి. కాగా, ఈఐయూ అనేది ‘ద ఎకనామిస్ట్’ కు అనుబంధ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా అత్యంత నివాసయోగ్యమైన నగరాల జాబితాను ఈ సంస్థ ఏటా విడుదల చేస్తుంది.
