కాళేశ్వరంపై విచారణ స్టార్ట్

కాళేశ్వరంపై విచారణ స్టార్ట్
  • కాళేశ్వరంపై విచారణ స్టార్ట్
  •  ఫైళ్లను విజిలెన్స్ పరిశీలిస్తోంది
  •  త్వరలో సిట్టింగ్ జడ్జితో కమిషన్
  •  భారీగా అప్పు చేసిన గత ప్రభుత్వం
  •  రైతులకూ ప్రయోజనం చేకూర్చలేదని వెల్లడి
  •  నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన తప్పిదాలు, లోపాలపై విజిలెన్స్ విచారణ ప్రారంభమైందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇవాళ జలసౌధలో ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంఆ ఆయన మాట్లాడుతూ.. ఇటీవల తాము స్వాధీనం చేసుకున్న ఫైళ్లను విజిలెన్స్ విభాగం క్షుణ్నంగా పరిశీలిస్తోందన్నారు. త్వరలోనే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తామని చెప్పారు. ఇందుకోసం హైకోర్ట్  చీఫ్ జస్టిస్ కు లేఖ రాసినట్టు తెలిపారు. ఐడీసీ పరిధిలో ఉన్న అన్ని ఎత్తిపోతల పథకాలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 

వచ్చే ఐదేండ్లలో ఏ ప్రాజెక్టులలో కొత్త ఆయకట్టు ఎంత ఇస్తున్నామనే సమాచారం సిద్ధం చేయాలని, కొత్త ఆయకట్టుకు నీరు ఇచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు ఎప్పటివరకూ నిర్మాణం పూర్తవుతాయని అధికారులతో చర్చించారు. ఏయే ప్రాజెక్టు ద్వారా ఎంతమేర సాగు జరుగుతుంది, మరిన్ని ఎకరాలకు నీరు అందించే అవకాశాలపై చర్చ జరిగింది. కొత్త ఆయకట్టు వివరాలపై ఇరిగేషన్ సెక్రటరీ, ఇరిగేషన్ & డిపార్ట్‌మెంట్ చీఫ్ ఇంజనీర్‌లతో ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిగతులపై మంత్రి ఉత్తమ్ సమీక్షించారు.

అప్పులు తెచ్చినా ఫాయిదా లేదు

ఏడాది చివరి (డిసెంబర్‌)కి 4.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వం ఇతర శాఖలతో పాటు నీటిపారుదల శాఖలోనూ భారీగా అప్పులు చేసిందన్నారు. ఖర్చులు చేసినా, అప్పులు తెచ్చినా అందుకు తగ్గట్లుగా రైతులకు ప్రయోజనం చేకూరలేదన్నారు. తమ ప్రభుత్వం అవసరం మేరకే ఖర్చులు చేస్తుందని, చేసిన ప్రతి రూపాయికీ విలువ ఉండేలా పనులు చేస్తామన్నారు.