
‘భద్రకాళి’ లాంటి పొలిటికల్ థ్రిల్లర్ ఇప్పటివరకు రాలేదని, ఈ సినిమా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుందని చిత్ర నిర్మాత రామాంజనేయులు జవ్వాజి అన్నారు. విజయ్ ఆంటోనీ హీరోగా అరుణ్ ప్రభు రూపొందించిన ఈ చిత్రం సెప్టెంబర్ 19న తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలవుతోంది.
ఈ సందర్భంగా నిర్మాత రామాంజనేయులు మాట్లాడుతూ ‘ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు ప్రేక్షకులను ఆలోచింపచేసే అంశాలు కూడా ఉన్నాయి. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో చాలా సినిమాలు వచ్చాయి కానీ ఇలాంటి క్యారెక్టర్‌తో ఇప్పటివరకు ఎలాంటి సినిమా రాలేదు.
ప్రస్తుత సమాజంలోని పరిస్థితుల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. మేము ఊహించిన దానికంటే అవుట్‌పుట్ బాగా వచ్చింది. సినిమా మొదలైన రెండు నిమిషాల్లోనే ప్రేక్షకులు కథలో లీనమైపోతారు.చాలా గ్రిప్ ఉన్న స్టోరీ ఇది. ప్రతి సీన్ ఆడియెన్స్‌ని హత్తుకుంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా బోర్ కొట్టదు. ఇందులో విజయ్ ఆంటోనీ గారు డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపిస్తారు. ఇది ఆయన 25వ సినిమా కావడం కలిసొచ్చింది.
అలాగే ‘భద్రకాళి’ టైటిల్‌తో దసరా నవరాత్రుల సమయంలో ఈ సినిమా విడుదలవడం ఆనందంగా ఉంది. మా గత చిత్రం ‘మార్గన్’ కంటే ఈ సినిమాకి ఇరవై శాతం థియేటర్స్ పెరిగే అవకాశం ఉందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం సంతోషంగా ఉంది’ అని చెప్పారు.
ఇటీవలే రిలీజ్ చేసిన ‘భద్రకాళి’ ట్రైలర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. మూడు నిమిషాల పాటు సాగిన ఈ ట్రైలర్, ఉత్కంఠ కలిగించే అంశాలతో అంచనాలు పెంచేసింది. విజయ్ ఆంటోనీ కెరియర్లో ‘భద్రకాళి’ 25వ మూవీగా వస్తుంది.
ఈ సినిమాకు విజయ్ ఆంటోని సంగీతాన్ని కూడా అందిస్తున్నారు. వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, మాస్టర్ కేశవ్ ఈ మూవీలో కీలక పాత్రలను పోషిస్తున్నారు.