రౌడీ హీరోగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రస్తుతం వరుస పరాజయాలతో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నారు. వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఖుషి, ది ఫ్యామిలీ స్టార్, కింగ్‌డమ్ వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఆయన కెరీర్ గ్రాఫ్ దిగజారింది.
ఈ పరిణామాలతో విజయ్ దేవరకొండ అభిమానుల ఆశలు క్రమంగా చల్లారుతున్నాయి. ఒక్క గట్టి హిట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు, తమ హీరో విజయాన్ని చూడాలనే ఆశతో నిరీక్షిస్తూ చివరికి నిరాశకు లోనవుతున్నారు. థియేటర్లలో చప్పట్లు కొడుతూ, విజిల్స్ వేస్తూ, గర్వంగా కాలర్ ఎత్తాలనే సంకల్పంతో ఉన్న ఫ్యాన్స్‌కు ఆ అవకాశం ఇప్పటివరకు దక్కలేదు.
ఈ పరిస్థితుల్లోనే ఓ సగటు విజయ్ దేవరకొండ అభిమాని విడుదల చేసిన భావోద్వేగ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమ అభిమాన హీరో ఎదుర్కొంటున్న పరిస్థితులు, అభిమానిగా తాను అనుభవిస్తున్న బాధను ఆ ప్రకటనలో వ్యక్తం చేస్తూ, అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతేకాదు, ఈ భావోద్వేగ లేఖ విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమా దర్శకుడు రాహుల్ సంకృత్యన్ దృష్టికి కూడా చేరింది. ఈ నేపథ్యంలో అభిమానుల లేఖకు రాహుల్ సంకృత్యన్ స్పందిస్తూ, అభిమానుల ఆకలిని తీర్చేలా ‘VD 14’ ఉండబోతోంది అని హామీ ఇచ్చారు.
విజయ్ దేవరకొండ అభిమానులు దర్శకుడు రాహుల్ సంకృత్యన్ను ఉద్దేశించి భావోద్వేగభరితమైన ఓ లేఖను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తమ ఆశలు, నిరీక్షణలు, అభిమానిగా ఎదుర్కొన్న బాధలను ఆ లేఖలో వారు వివరించారు.
2018లో విజయ్ దేవరకొండ అభిమానిగా తన ప్రయాణం ప్రారంభమైందని వెల్లడించిన అభిమాని యశ్వంత్, 2019లో విడుదలైన డియర్ కామ్రేడ్ చిత్రం తనను మరింతగా ప్రభావితం చేసిందని చెప్పాడు. ఆ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ తనకు కేవలం నటుడే కాకుండా ప్రత్యేకమైన వ్యక్తిగా మారాడని తెలిపాడు. అయితే, గత ఏడు సంవత్సరాలుగా సంబరాల కంటే బాధలే ఎక్కువగా ఎదురయ్యాయని వాపోయాడు.
ఒక సాధారణ అభిమాని పడే కష్టాలను అర్థం చేసుకోవాలని కోరుతూ, విజయ్ దేవరకొండ సినిమాలను కేవలం చూడటమే కాకుండా జీవించానని, స్నేహితులను థియేటర్లకు తీసుకెళ్లి ఎంతో నమ్మకంతో సినిమాలపై హైప్ ఇచ్చేవాడినని వివరించాడు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా వచ్చిన ఫలితాలు అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశాయని పేర్కొన్నాడు. సినిమా ఫెయిలయితే, ముందుగా అభిమానులనే నిందించడం, ఎగతాళి చేయడం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు.
అయితే, ఇప్పుడు తమ ఆశలన్నింటినీ దర్శకుడు రాహుల్ సంకృత్యన్‌పై పెట్టుకున్నామని అభిమానులు తెలిపారు. స్వాతంత్ర్యానికి పూర్వపు నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమా అపారమైన సామర్థ్యం ఉన్న కథ అని, టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ వంటి చిత్రాల్లో రాహుల్ సంకృత్యన్ చూపించిన కథన శైలి తమకు ఎంతో నచ్చిందని పేర్కొన్నారు. తాము ప్రేమించే పాత విజయ్ దేవరకొండను తిరిగి తెరపై చూపించగల దర్శకుడు రాహుల్ మాత్రమేనని విశ్వాసం వ్యక్తం చేశారు.
గత చిత్రాల్లో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అభిమానులు విజ్ఞప్తి చేశారు. స్క్రిప్ట్ నుంచి ఎడిటింగ్ వరకు దర్శకుడు స్వయంగా పర్యవేక్షించాలని, ప్రమోషన్లు, పాటల విడుదల, అప్‌డేట్స్ అన్నీ సమయానికి రావాలని కోరారు. గతంలో సరైన ప్రచారం లేకపోవడం వల్ల అభిమానులు చాలా బాధపడ్డామని స్పష్టం చేశారు.
“ఇది మాకు కేవలం ఒక సినిమా కాదు, మా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం” అని పేర్కొన్న అభిమానులు, వైఫల్యాలను సమర్థించుకోవడం తమకు విసుగును తెప్పిస్తోందని తెలిపారు. తెరపై, ప్రేక్షకుల హృదయాల్లో రాజ్యమేలిన పాత విజయ్ దేవరకొండను మళ్లీ చూడాలని, సినిమా ముగిసిన తర్వాత థియేటర్ అంతా నిలబడి దర్శకుడి విజన్‌కు చప్పట్లు కొట్టే క్షణాన్ని చూడాలని ఆకాంక్షించారు.
ఈ విజయానికి అభిమానులు ఎంతో “ఆకలితో” ఎదురుచూస్తున్నామని, దర్శకుడు రాహుల్ సంకృత్యన్‌పై, ఈ ప్రాజెక్ట్‌పై తమకు పూర్తి నమ్మకం ఉందని లేఖ ముగింపులో విజయ్ దేవరకొండ అభిమాని యశ్వంత్ వెల్లడించాడు.
ఈ నేపథ్యంలో అభిమాని యశ్వంత్ లేఖకు రాహుల్ సంకృత్యన్ స్పందిస్తూ, అభిమానుల ఆకలిని తీర్చేలా ‘వీడీ 14’ ఉండబోతోంది అని హామీ ఇచ్చారు. దర్శకుడు ఇచ్చిన ఈ స్పందన సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. దీంతో విజయ్ దేవరకొండ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. తమ హీరోకు ఈసారి తప్పకుండా గట్టి కంబ్యాక్ ఉంటుందనే నమ్మకం ఫ్యాన్స్‌లో మరింత బలపడుతోంది.
ఇక ‘వీడీ 14’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. స్వాతంత్ర్యానికి పూర్వపు కాలం నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ సినిమా పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ డ్రామాగా రూపొందనుందని సమాచారం. కథలో ఉత్కంఠభరితమైన అంశాలు, బలమైన భావోద్వేగాలు ఉండనున్నట్లు తెలుస్తోంది.
The GODS gave him STRENGTH. War gave him a PURPOSE 🔥
— Rahul Sankrityan (@Rahul_Sankrityn) May 9, 2025
Team #VD14 wishes @TheDeverakonda a very Happy Birthday ❤️🔥@rahulsankrityan @mythriofficial #BhushanKumar #KrishanKumar @tseriesfilms @tseries.official @shivchanana @neerajkalyan24 pic.twitter.com/sorMDxFXtT
