విశ్వనగరంలో అభివృద్ధి ఇదేనా?

విశ్వనగరంలో అభివృద్ధి ఇదేనా?
  • నీట మునిగిన లోతట్టు ప్రాంతాలను పట్టించుకోరా?
  • సర్కారు తీరుపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి ఫైర్
  • వరద ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ నేతల పర్యటన
  • ముంపు ప్రాంత వాసులకు నిత్యావసరాలు, ఫుడ్ అందజేత

 గచ్చిబౌలి/మూసాపేట/పద్మారావునగర్/ముషీరాబాద్/మూసాపేట/గండిపేట, వెలుగు: పదేండ్లుగా లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వర్షాలకు నీట మునుగుతూనే ఉందని, దీని కారణంగా హైటెక్ సిటీ వైపు వెళ్లే వాహనదారులు ఇబ్బందున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి మండిపడ్డారు. ఇటీవల కురిసిన వానలకు నీట మునిగిన లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జిని శేరిలింగంపల్లి బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి గజ్జెల యోగానంద్, స్థానిక నేతలతో కలిసి శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సర్కారు వచ్చి తొమ్మిదేండ్లు దాటినా లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి ముంపు సమస్యను పరిష్కరించలేదన్నారు. సిటీలో డెవలప్ మెంట్ ఏ స్థాయిలో ఉందో ఈ బ్రిడ్జిని చూస్తే తెలుస్తుందన్నారు.  

వర్షాలకు శేరిలింగంపల్లి సెగ్మెంట్ లోని  లోతట్టు ప్రాంతాల జనం అవస్థలు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు తగ్గినా అధికారులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు నీట మునిగిన కాలనీలను సందర్శించి సమస్యలను తెలుసుకోవడం లేదని విజయశాంతి ఆరోపించారు. అనంతరం అల్విన్ కాలనీ డివిజన్ సిక్కు బస్తీలోనూ ఆమె పర్యటించారు. ఇండ్లలోకి నీళ్లు చేరడంతో బిక్కు బిక్కుమంటూ బతకాల్సి వస్తోందని, స్థానిక కార్పొరేటర్ పట్టించుకోవట్లేదంటూ బస్తీ వాసులు ఆమెకు  తమ సమస్యను చెప్పుకున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు తగిన సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. విజయశాంతి వెంట బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. 

బన్సీలాల్ పేట డివిజన్ రామస్వామి కాంపౌండ్ బస్తీని సికింద్రాబాద్ ఎంపీ సెగ్మెంట్​ కో – ఆర్డినేటర్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నేతలు సందర్శించారు. బస్తీ పక్కనే ఉన్న నాలా నుంచి  పాములు ఇండ్లలోకి వస్తున్నాయని స్థానికులు చెప్పగా, సమస్యలను జీహెచ్ఎంసీ దృష్టికి తీసుకెళ్తామని బీజేపీ నాయకులు వారికి భరోసానిచ్చారు. వర్షాలకు నష్టపోయిన వారికి ఆర్థిక సాయం అందించాలని రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు.  హిమాయత్ నగర్ లోని లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు చేరి ఇబ్బంది పడుతున్న బస్తీ వాసులకు హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కేశబోయిన శ్రీధర్ ఆధ్వర్యంలో నాయకులు ఫుడ్, వాటర్ ను అందజేశారు. బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధి కిస్మత్ పురాలో నెలకొన్న సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని బీజేపీ నేతలు కోరారు. ఈ మేరకు కమిషనర్ శరత్ చంద్రకు వినతి పత్రం అందజేశారు.