సుప్రీం తీర్పును సీఎం కేసీఆర్‌ జీర్ణించుకోలేకపోతున్నారేమో?

సుప్రీం తీర్పును సీఎం కేసీఆర్‌ జీర్ణించుకోలేకపోతున్నారేమో?

అయోధ్యలో రామ జన్మభూమికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి తప్పుబట్టారు. సుప్రీం తీర్పుపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతుంటే, తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ఎంఐఎంతో సత్సంబంధాల కోసం నోరు మెదపడంలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘తెలంగాణ సీఎం కేసీఆర్ అయోధ్యలో రామ జన్మభూమికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించకుండా, తప్పించుకోవడం వెనక చాలా మతలబ్ ఉన్నట్లు స్పష్టమవుతోంది. దేశమంతా రామమందిరం నిర్మాణానికి సంబంధించి హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉంటే… తెలంగాణ సీఎం దొరగారు మాత్రం సెక్యూలరిజం పేరుతో… ఎంఐఎం ప్రాపకం కోసం సుప్రీం తీర్పుపై సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. పైకి తాను అసలైన హిందువు అని చెప్పుకునే కేసీఆర్ గారికి.. లోలోపల రామమందిరం నిర్మాణం పట్ల ఎంత వ్యతిరేకత ఉందో గతంలో ఆయన చేసిన కామెంట్‌ను చూస్తే అర్థమవుతుంది. రామమందిరం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని… అయోధ్య అంశాన్ని తోకతో పోలుస్తూ గతంలో కేసీఆర్ గారు విమర్శించడం దొరగారి అహంకారానికి నిదర్శనం. ఇంతకు ముందు తన మనసులోని మాటను బయటపెట్టిన కేసీఆర్ గారు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు రామాలయ నిర్మాణానికి అనుకూలంగా ఉండటంతో జీర్ణించుకోలేకపోతున్నారేమో? దీన్నే కుహనా లౌకిక వాదం అంటారు… గతంలో కేసీఆర్ గారు రామమందిరం పై ఏర్పాటుపై మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం దేశ ఆర్థికస్థితిని ఎలా మెరుగుపరచాలో ఆలోచించకుండా.. గుళ్లు, గోపురాలు అంటూ ఏవేవో గొడవలపై అనవసర రాద్ధాంతం చేస్తుందని అన్నారు. దీన్ని బట్టి ఆయనకు హిందుత్వంపై ఏపాటి గౌరవం ఉందో తెలుస్తుంది.’’ అని ఫేస్‌బుక్ వేదికగా సీఎం కేసీఆర్‌పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ పోస్ట్ చేశారు.

మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ను ఫాలో అవ్వండి