జనం ఆలోచనల్ని కేసీఆర్ కలుషితం చేస్తున్నడు

జనం ఆలోచనల్ని కేసీఆర్ కలుషితం చేస్తున్నడు

హైదరాబాద్, వెలుగు: ప్రజల ఆలోచనా విధానాన్ని కేసీఆర్​ కలుషితం చేశారని, ప్రతిపక్షాలకు ఓటేసి గెలిపించినా ప్రలోభాలకు లొంగి, టీఆర్ఎస్‌‌లో చేరుతున్నారన్న సంకేతం ప్రజల్లోకి వెళ్లిందని, దీంతో ఇతర పార్టీలకు ఓటు వేయడం కంటే టీఆర్ఎస్ కు  ఓటు వేయాలన్న ఆలోచన వాళ్లలో కలిగేలా అధికార పార్టీ చేస్తోందని కాంగ్రెస్​ నేత విజయశాంతి ఆరోపించారు. ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులను వివిధ రకాల ప్రలోభాలతో లొంగదీసుకోవడం కేసీఆర్ అండ్ కోకు కొత్తేమీ కాదని, రాజకీయాల్లో ప్రతిపక్షం అనేది లేకుండా చేసి, నియంతృత్వ పోకడలకు నిలువెత్తు నిదర్శనంగా కేసీఆర్ నిలిచారని మండిపడ్డారు. ఈ మేరకు ఫేస్ బుక్‌‌లో శనివారం ఓ పోస్ట్ పెట్టారు. కాంగ్రెస్, టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, వారికి మంత్రి పదవులిచ్చి రాజ్యాంగాన్ని మంట కలిపిన ఘనత కేసీఆర్ కే దక్కిందని మండిపడ్డారు. అక్కడి నుంచి మొదలైన ఈ ప్రక్రియ జడ్పీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ తరఫున గెలిచిన వారిని కొనడంతోపాటు చివరకు మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన ప్రతిపక్షానికి చెందిన ప్రతినిధులను లొంగదీసుకునే వరకూ కొనసాగుతూనే ఉందని ఆరోపించారు. గత మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఎన్నిటిని అమలు చేశారనే ప్రశ్నకు కేసీఆర్​ వద్ద సమాధానం దొరకదని అన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాతైనా సీఎం మైండ్ సెట్ మారుతుందని ప్రజలు ఆశిస్తున్నారని, వారి ఆశలు అడియాశలు కాకూడదని తాను కోరుకుంటున్నానని విజయశాంతి చెప్పారు.