
- బీజేపీకి విజయశాంతి రాజీనామా .. పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డికి రిజైన్ లెటర్
- కొన్ని రోజులుగా బీజేపీపై తీవ్ర అసంతృప్తి
- స్టార్ క్యాంపెయినర్ జాబితాలో తన పేరు లేకపోవడంతో మనస్తాపం
- త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రచారం
హైదరాబాద్, వెలుగు: బీజేపీకి విజయశాంతి రాజీనామా చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి బుధవారం సాయంత్రం రిజైన్ లెటర్‌ను పంపారు. త్వరలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేసేందుకు ఇటీవల 40 మందితో బీజేపీ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్‌ను ప్రకటించింది. అందులో విజయశాంతి పేరు లేకపోవడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. జరిగిన తప్పును గుర్తించిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం స్టార్ క్యాంపెయినర్‌గా ఎమ్మెల్యే రఘునందన్‌తో పాటు విజయశాంతిని నియమిస్తున్నట్లు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. అయి నా ఆమె సంతృప్తి చెందలేదు. దీంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీకి విజయశాంతి రాజీనామా చేసినట్లు సమాచారం. ఆమె రాజీనామాను రాష్ట్ర పార్టీ కూడా ధ్రువీకరించింది.
పార్టీ పక్కనపెట్టడంతోనేనా..
కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకా రం చేస్తున్న సమయంలో వేదికపై మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఉండడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. తెలంగాణ ద్రోహులతో కలిసి వేదికను పంచుకోలేకనే అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు విజయశాంతి ట్విట్టర్‌లో తెలిపారు. అప్పటి నుంచి ఆమె పార్టీ రాష్ట్ర నాయకత్వ తీరుపై గుర్రుగా ఉన్నారు. గత కొన్ని రోజులుగా బీజేపీకి వ్యతిరేకంగా వరుస ట్వీట్‌లు చేస్తూ.. అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ నెల 11న అణగారిన వర్గాల విశ్వరూప మహాసభకు హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోదీకి బేగంపేట్ ఎయిర్ పోర్టులో విజయశాంతి స్వాగతం పలికారు. మోదీకి స్వాగ తం పలికిన నాలుగు రోజుల్లోనే విజయశాంతి పార్టీకి రాజీనామా చేయడం చర్చకు దారితీసింది. కాగా, బీజేపీని తెలంగాణ ఉద్యమకారులు ఒక్కొక్కరుగా వీడుతున్నారు. ఇటీవలే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, ఇప్పుడు విజయశాంతి కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు.