మన భూముల వివరాలు విదేశీ కంపెనీ చేతుల్లోనా?

మన భూముల వివరాలు విదేశీ కంపెనీ చేతుల్లోనా?
  • ధరణి డేటా హ్యాక్ అయితే పరిస్థితేంటి?

హైదరాబాద్​, వెలుగు: ధరణి పోర్టల్​లో భూ రికార్డుల భద్రతపై అనుమానాలున్నాయని బీజేపీ సీనియర్​ నేత విజయశాంతి ఆరోపించారు. రాష్ట్రంలోని మొత్తం భూముల రికార్డులను దివాళా తీసిన టెర్రాసిస్​ చేతుల్లో పెట్టడం సర్కారు దివాళాకోరుతనాన్ని బయట పెట్టిందని శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె మండిపడ్డారు. బ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టినట్టు ఆరోపణలున్న ఐఎల్​ఎఫ్​ఎస్​ అధీనంలో ఈ టెర్రాసిస్​ సంస్థ ఉండేదని తెలిపారు. ఇప్పుడు టెర్రాసిస్​లో సగానికిపైగా వాటాను ఫిలిప్పీన్స్​కు చెందిన ఫాల్కన్​ గ్రూపుకు ఐఎల్​ఎఫ్​ఎస్​ అమ్మేసిందని చెప్పారు. అలాంటి సంస్థకు ధరణి కాంట్రాక్టును కట్టబెట్టడం వల్ల మన భూముల వివరాలు మొత్తం విదేశీ కంపెనీ చేతుల్లోకి వెళ్లాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రెవెన్యూ వ్యవస్థలో రిఫార్మ్స్​ పేరిట తీసుకొచ్చిన పోర్టల్​లోని సమస్యలతో రైతులు ఇప్పటికే గుండెలు బాదుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 70 లక్షల మందికి చెందిన కోటిన్నర ఎకరాల భూములు, ప్రభుత్వ, ఎండోమెంట్​, వక్ఫ్​, ఫారెస్ట్​ డిపార్ట్​మెంట్లకు చెందిన కోటి ఎకరాలకు పైగా భూముల సమాచారాన్ని దివాళా తీసిన కంపెనీ చేతిలో పెట్టడం సరికాదని అన్నారు. ఈ డేటాపై సైబర్​ దాడులు జరిగి హ్యాక్​ అయితే మన రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఏవైనా సమస్యలొస్తే మాన్యువల్​ రికార్డుల ద్వారా పరిష్కారం దొరుకుతుందని, కానీ, వాటిని పరిరక్షించే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయడం లేదని విజయశాంతి ఆరోపించారు. భూ రికార్డుల భద్రతపై సమాచర హక్కు చట్టం ద్వారా అడిగినా సమాచారం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.