వికారాబాద్, వెలుగు: ఏదైనా వస్తువు కొంటే తప్పకుండా రశీదు తీసుకోవాలని వికారాబాద్ అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్ వినియోగదారులకు సూచించారు. బుధవారం వికారాబాద్ జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. డిజిటల్ న్యాయ వ్యవస్థ ద్వారా త్వరగా, సమర్థవంతంగా కేసులు పరిష్కారమనే కాన్సెప్ట్ తో రాష్ట్ర ప్రభుత్వం ముదుకు సాగుతోందన్నారు. కొనుగోలు చేసిన వస్తువు నాణ్యత లోపిస్తే రశీదు ఆధారంగా కన్స్యూమర్ ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చన్నారు.
ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలి..
బషీర్బాగ్: వినియోగదారులు ఏదైనా వస్తువు కొంటే బిల్లుతో పాటు గడువు తేదీని చూసుకోవాలని తూనికలు కొలతల అధికారి శ్రీవల్లి సూచించారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఎమ్మార్పీపై స్టిక్కర్లు అతికించడం చట్టవిరుద్ధమన్నారు. సీఎం ఓఎస్డీ శ్రీనివాసులు మాట్లాడుతూ .. దుకాణదారుడు ధర్మాన్ని పాటిస్తే ఎలాంటి చట్టాలు అవసరం లేదన్నారు. కార్యక్రమంలో హైకోర్టు మాజీ జస్టిస్ చంద్రకుమార్, డీసీఎస్వో శ్రీనివాస్, ఫుడ్ ఇన్స్పెక్టర్ దైవ నిధి పాల్గొన్నారు.
చట్టంపై అవగాహన ఉండాలి..
ముషీరాబాద్: ప్రజలకు కన్జ్యూమర్ రైట్స్ పై అవగాహన ఉండాలని రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత అన్నారు. జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ రాచమల్ల సాయి రమేశ్అధ్యక్షతన బుధవారం బాగ్ లింగంపల్లి లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. క్రైం ఏసీపీ కిరణ్ కుమార్, కార్పొరేటర్ హేమ, ఉప్పల శ్రీనివాస్ గుప్తా పాల్గొన్నారు.
