వికారాబాద్, వెలుగు: భార్య, పిల్లల హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ వికారాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడైన గురు ప్రవీణ్ కుమార్ 2019లో తన భార్యతో పాటు ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. ఈ కేసు విచారణలో భాగంగా ఆధారాలను పరిశీలించిన వికారాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి శ్రీనివాస్ రెడ్డి నిందితుడికి ఉరిశిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించారు.
జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 6 నెలల కఠిన కారాగార శిక్ష అనుభవించాలని ఆదేశించారు. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ప్రవీణ్ ఆరేండ్ల క్రితం ఈ హత్యలకు పాల్పడ్డాడు. మొదట భార్యతో గొడవపడ్డాడు. ఆ తర్వాత ఆమెను, బాబును ఇనుప రాడ్డుతో బలంగా కొట్టి హత్య చేశాడు. అనంతరం కూతురు గొంతు నులిమి చంపేశాడు. హత్య చేసిన తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలనున్నాడు. అనంతరం ప్రవీణ్ మనసు మార్చుకుని పోలీసులకు లొంగిపోయాడు.
