అంగీలు చింపుకొని కొట్టుకున్న కార్యకర్తలు

అంగీలు చింపుకొని కొట్టుకున్న కార్యకర్తలు

వికారాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు :  వికారాబాద్ జిల్లాలో జడ్పీ చైర్​పర్సన్​ సునీతా రెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్​ మధ్య ఆధిపత్య పోరు తారా స్థాయికి చేరిది. ఒకే పార్టీకి చెందిన ఇరు వర్గాల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అంగీలు చింపుకొని.. కొట్టుకున్నారు. ఈ ఘటనలో సునీతా రెడ్డి కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. మర్పల్లిలో సాయిబాబా టెంపుల్ దగ్గర జరుగుతున్న గురు పౌర్ణమి ఉత్సవాలకు జడ్జీ చైర్​పర్సన్​ సునీతా రెడ్డి వచ్చారు. ఎమ్మెల్యే ఆనంద్​ వర్గీయులు ఆమె కారును అడ్డుకుని రాళ్ల దాడికి దిగారు. దీంతో సునీతా రెడ్డి వర్గం అడ్డుకుని.. ఆమెను సురక్షితంగా పూజా కార్యక్రమాలకు తీసుకెళ్లింది. మహేందర్​ రెడ్డి డౌన్​.. డౌన్.., సునీతా రెడ్డి గో బ్యాక్​ అంటూ 30 మంది కార్యకర్తలు నిరసన తెలిపారు. మర్పల్లి గడ్డ.. ఎమ్మెల్యే ఆనంద్​ అడ్డా.. అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే ఆనంద్​ను అవమానించేలా ప్రవర్తిస్తే సహించేది లేదంటూ హెచ్చరించారు. జడ్పీ చైర్​పర్సన్​గా ఉంటూ ప్రొటోకాల్​ పాటించడం లేదన్నారు.  సునీతా రెడ్డి కారుపై బండ రాయి వేయడంతో వెనుక గ్లాస్​ పగిలిపోయింది. దాడికి పాల్పడిన వారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని వికారాబాద్​ ఎస్పీ కోటిరెడ్డికి జడ్పీ చైర్​పర్సన్​ సునీతారెడ్డి ఫిర్యాదు చేశారు.