పల్లెటూరు పిల్లలే ఆటల్లో అదరగొడుతున్నరు

పల్లెటూరు పిల్లలే ఆటల్లో అదరగొడుతున్నరు
  • రాష్ట్ర జిమ్నాస్టిక్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రఘునందన్‌ రావు

వికారాబాద్, వెలుగు: పల్లెటూరు పిల్లలే అన్ని క్రీడల్లో రాణిస్తున్నారని రాష్ట్ర జిమ్నాస్టిక్‌ అధ్యక్షుడు, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు అన్నారు. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్‌ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో 48వ జూనియర్‌‌ రాష్ట్ర స్థాయి అంతర్‌‌ జిల్లాల బాల, బాలికల కబడ్డీ చాంపియన్‌ షిప్‌- 2022ను వికారాబాద్‌ బ్లాక్‌ గ్రౌండ్‌లో శుక్రవారం రాత్రి ప్రారంభించి మాట్లాడారు. స్టూడెంట్లు స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాలు, గిరిజన తండాల నుంచి వచ్చిన పిల్లలే ప్రపంచంలోని అన్ని క్రీడల్లో ముందున్నారని, ఆర్థికంగా లేక అవకాశాలు అందక వారు మరుగున పడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక మనిషి మర మనిషి అయ్యాడని, ఎక్కువ మంది పిల్లలు సెల్‌ఫోన్‌, లాప్‌ట్యాప్‌లలో గేమ్స్‌ ఆడుతున్నారన్నారు. కబడ్డీ, ఖోఖో, జిమ్నాస్టిక్స్, రన్నింగ్‌, క్రికెట్, వాలీబాల్, త్రోబాల్, బాస్కెట్‌బాల్, ఫాస్ట్‌ బాల్ ఆడిన స్టూడెంట్లకు ఫిజికల్‌ ఫిట్‌నెస్‌తో పాటు స్నేహ భావం, చేసే పనిలో ఏకాగ్రత పెరిగి లక్ష్యం చేరుతారన్నారు. 130 కోట్ల మంది జనాభా ఉన్న మనదేశంలో క్రీడాకారులు తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం ప్రభుత్వాలేనని ఆరోపించారు. ఆటగాళ్లకు అన్నం పెట్టేందుకు ముందుకు వచ్చిన చిన్న పిల్లల డాక్టర్‌‌ టి.ఆనంద్‌ను రఘునందన్‌ అభినందించారు. జిల్లాలోని బ్లాక్‌ గ్రౌండ్‌ను రూ.కోటితో అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ హామీ ఇచ్చారు.