- ఉపాధి పనులపై పంచాయతీ సెక్రటరీలకు కొత్త గైడ్‌లైన్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో గ్రామ పంచాయతీ కార్యదర్శుల పాత్రను ప్రభుత్వం మరింత కీలకం చేసింది. ఈ పథకం నిర్వహణలో క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న లోపాలను సరిదిద్దేందుకు సెక్రటరీల బాధ్యతలను వివరిస్తూ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ డి.దివ్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొంతమంది కార్యదర్శులు తమ విధులను సక్రమంగా నిర్వహించడం లేదని ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో అన్ని జిల్లాల కలెక్టర్లు, పంచాయతీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
గ్రామాల్లో ఉపాధి హామీ పనులతో పాటు ‘తెలంగాణకు హరితహారం’ పనుల పర్యవేక్షణను పంచాయతీ కార్యదర్శులే నిర్వహించాలని పేర్కొన్నారు. కూలీల నుంచి పని కోసం వచ్చే డిమాండ్‌ను మేట్లతో కలిసి కార్యదర్శులే సేకరించాలని, టెక్నికల్ అసిస్టెంట్లతో సమన్వయం చేసుకుంటూ పనులను ప్రారంభించాలని సూచించారు.
పని ప్రదేశాల్లో మేట్లు రికార్డు చేసే మస్టర్లను ప్రతి వారం చివరలో కార్యదర్శి తప్పనిసరిగా తనిఖీ చేసి, కౌంటర్ సంతకం చేయాలని, అనంతరం వాటిని టెక్నికల్ అసిస్టెంట్లకు అందజేయాలన్నారు. ఎన్‌ఎంఎంఎస్ యాప్ ద్వారా కూలీల హాజరును ఫేస్ అథెంటికేషన్ పద్ధతిలో అప్‌లోడ్ చేసేలా పర్యవేక్షించాలని సూచించారు. గ్రామ పంచాయతీ స్థాయిలో ఉపాధి హామీకి సంబంధించి ఏడు రకాల రిజిస్టర్లను నిరంతరం అప్‌డేట్ చేయడంతో పాటు కూలీల జాబ్ కార్డుల అప్‌డేషన్ బాధ్యత కూడా కార్యదర్శులదేనని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పని ప్రదేశాల్లో కూలీలకు తాగునీరు, నీడ వంటి కనీస వసతులు కల్పించాలని, ప్రతి వారం మేట్లతో సమావేశం నిర్వహించి పనుల పురోగతిని సమీక్షించాలని, పని ప్రదేశాల్లో బోర్డులు ఏర్పాటు చేసేలా చూడాలని ఆదేశించారు. పని ప్రదేశాల్లో ‘వర్క్ సైట్ బోర్డులు’ ఉన్నాయో లేదో చెక్ చేయాలని సూచించారు. ఈ ఆదేశాలను జిల్లా పంచాయతీ అధికారులు వెంటనే అమలు చేయాలని, నిర్లక్ష్యం వహించే కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
