అర్ధరాత్రి ప్రేమికులను పట్టుకున్న గ్రామస్థులు

అర్ధరాత్రి ప్రేమికులను పట్టుకున్న గ్రామస్థులు

పాట్నా : కొన్ని సంవత్సరాలుగా రాత్రి పూట సీక్రెట్ గా కలుసుకుంటున్న ప్రేమికులను పట్టుకున్న గ్రామస్థులు అప్పటికప్పుడు పెళ్లి చేశారు. ఈ ఘటన బీహార్ లో జరిగింది.

వివరాలు: మోతీహారీ జిల్లా, కోన్హియా గ్రామానికి చెందిన ఓ యువతి..పక్క ఊరికి చెందిన యువకుడు కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. రాత్రి సమయంలో యువతి ఊరికొచ్చి సీక్రెట్ గా కలుసుకుంటున్న  ఆ యువకుడిపై కన్నేశారు గ్రామస్థులు. మన ఊరి బిడ్డను వాడుకుని వదిలేస్తాడా అనే డౌట్ కొంతమందిలో వచ్చింది. దీంతో అందరు కూడా ఓ నిర్ణయానికి వచ్చారు. ఈ సారి ఎలాగైనా ప్రేమికులను పట్టుకోవాలని డిసైడ్ అయ్యారు.

ఎప్పటిలాగే మంగళవారం అర్ధరాత్రి తన ప్రియురాలిని కలిసేందుకు ఆ యువకుడు కోన్హియాకు వచ్చాడు. అతడి రాకను గమనించిన గ్రామస్తులందరూ ఒక్కచోట పోగయ్యారు. ప్రేమికులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీరంతా ప్రేమజంటను సమీపిస్తుండగా యువకుడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే అతడిని పట్టుకుని ఎలాంటి వార్నింగ్ ఇవ్వకుండా మర్యాదగా మాట్లాడిన గ్రామస్తులు.. తమ ఊరి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడిగారు.

ఇష్టమే అని చెప్పడంతో..అమ్మాయిని కూడా పిలిచి అడిగారు. ఆమె కూడా ఓకే చెప్పడంతో.. వెంటనే పూజారిని పిలిపించి అర్ధరాత్రి అదేచోట పెళ్లి జరిపించారు గ్రామస్థులు. ప్రేమ పేరుతో దొంగచాటుగా కలుసుకోవడం మన సంప్రదాయం కాదని.. వారికి చెప్పి ఆశీర్వాదం ఇచ్చారు గ్రామస్థులు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి వచ్చేవరకు పెళ్లి జరిగిపోయింది. ఇద్దరూ మేజర్లే కావడంతో పోలీసులు కూడా ఆ నవదంపతులను ఆశీర్వదించారు.