ఇండ్లన్నీ కూలినా ఆ ఊర్లో ఒక్కరూ చనిపోలే!

ఇండ్లన్నీ కూలినా ఆ ఊర్లో ఒక్కరూ చనిపోలే!

కాఠ్మాండు: భూకంప తీవ్రతకు ఆ ఊర్లోని దాదాపు 90% ఇండ్లు దెబ్బతిన్నయ్.. పునర్నిర్మాణం చేపడితే కానీ అందులో నివసించే అవకాశమే లేదంటే ఏ స్థాయిలో దెబ్బతిన్నాయో అర్థం చేసుకోవచ్చు. మరో వెయ్యి ఇండ్లకూ భారీ నష్టమే వాటిల్లింది. అయితే, ఆశ్చర్యకరంగా ఆ ఊర్లో ఒక్కరు కూడా చనిపోలేదు. జిల్లా అధికారులు కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. ఆస్తి నష్టం ఎక్కువ ఉన్నప్పటికీ ప్రాణనష్టం లేకపోవడం సంతోషకరమైన విషయమని చెప్పారు. 

నేపాల్​లో శుక్రవారం రాత్రి భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే.. ఈ ఘటనలో జాజర్ కోట్, రుకుం జిల్లాలే ఎక్కువగా ప్రభావితమయ్యాయి. చనిపోయిన 157 మంది కూడా ఈ జిల్లాలకు చెందిన వారే.. అయినప్పటికీ  జాజర్ కోట్ జిల్లాలోని బేర్ కోట్ రూరల్ మున్సిపాలిటీలో రామిదండ గ్రామస్థులంతా ప్రమాదాన్ని తప్పించుకున్నారు. 

ఐదుగురు గ్రామస్తులు గాయపడగా.. అందులో ఇద్దరికి స్థానికంగా చికిత్స అందిస్తున్న వైద్యులు మిగతా ముగ్గురిని మాత్రం మెరుగైన చికిత్స కోసం సిటీ ఆసుపత్రికి పంపించారు. భూకంపం తర్వాత రామిదండ గ్రామాన్ని చూసిన వారు ఎవరైనా సరే గ్రామస్థులు ఒక్కరు కూడా చనిపోలేదంటే నమ్మలేరని అధికారులు చెప్పారు.