
సిద్దిపేట జిల్లా : కూర రాజన్న, అమరన్న, వెంకటేష్ లను గురువారం రోజు (ఆగస్టు 24న) మధ్యాహ్నం పోలీసులు అదుపులో తీసుకున్నారనే సమాచారం తమకు వచ్చిందన్నారు అరుణోదయ గౌరవాధ్యక్షురాలు విమలక్క. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న కూర రాజన్నను కోర్టుకు తీసుకెళ్తూ.. మిర్యాలగూడలోని ఓ తోటలో విచారణ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అదుపులో తీసుకున్న వారిని వెంటనే కోర్టులో హాజరు పరిచి, బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజా ఉద్యమాల నిర్బంధాన్ని కొనసాగించవద్దని, ఉద్యమాల పేరిట పెట్టిన కేసులన్నీ ఎత్తేసే వరకూ ప్రతి వేదికపై డిమాండ్ చేస్తామని హెచ్చరించారు విమలక్క. తెలంగాణ సాధన కోసం కూర రాజన్న, అమరన్న అహర్నిశలు కృషి చేశారని చెప్పారు. తనపై ఉన్న కేసులను ఎత్తివేయాలని గద్దరన్న కూడా తిరిగిన చోటు లేదన్నారు. గజ్వేల్ పట్టణంలో టీపీటీఎఫ్ గజ్వేల్ జోన్ ఆధ్వర్యంలో గద్దర్ సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ కాశీం, విమలక్క పాల్గొన్నారు.