హైదరాబాద్​లో కన్నుల పండువగా నిమజ్జనం

హైదరాబాద్​లో కన్నుల పండువగా నిమజ్జనం
  • హుస్సేన్​సాగర్​ చుట్టూ ఇసుకేస్తే రాలనంత జనం
  • ఏడుగంటల పాటు సాగిన ఖైరతాబాద్​ బడా గణేశ్​ శోభాయాత్ర 
  • 35 వేల మంది బలగాలతో బందోబస్తు
  • రూ. 24.6 లక్షలు పలికిన బాలాపూర్​ లడ్డూ

హైదరాబాద్​, వెలుగు: తొమ్మిది రోజులు పూజలందుకున్న గౌరీ తనయుడు గణపయ్య.. గంగమ్మ ఒడికి చేరిండు. హైదరాబాద్​లో శుక్రవారం కన్నులపండువగా శోభాయాత్రలు సాగినయ్. లక్షలాది మంది భక్తులు ట్యాంక్​బండ్​కు తరలి వచ్చి వినాయక నిమజ్జనోత్సవంలో  పాల్గొన్నారు. డ్యాన్సులు, కేరింతలతో పరిసరాలు హోరెత్తాయి. ఎంజే మార్కెట్, ట్యాంక్​బండ్​, నెక్లెస్​రోడ్డు, ఎన్టీఆర్​ మార్గ్​ జనంతో నిండిపోయాయి. వాన పడుతున్నా లెక్క చేయకుండా జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఖైరతాబాద్​ బడా గణేశుడి శోభా యాత్ర ఈ సారి ఆలస్యంగా ప్రారంభమైంది. ఉదయం 10 గంటలకు బడా గణేశుడ్ని భారీ ట్రాలీ పైకి ఎక్కించినా యాత్ర మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైంది. ఏడు గంటల పాటు సాగింది. సాయంత్రం 6.58 గంటలకు ఎన్టీఆర్‌‌‌‌ మార్గ్‌‌లోని క్రేన్‌‌ నంబర్‌‌‌‌ 4 వద్ద హుస్సేన్​సాగర్​లో ఖైరతాబాద్​ బడా గణేశ్​ నిమజ్జనం పూర్తయింది. సిటీలో మరో ముఖ్యమైన బాలాపూర్​ వినాయకుడి ఊరేగింపు ఉదయం 11.40 గంటలకు ప్రారంభమైంది. రాత్రి 10.45 గంటలకు నిమజ్జనం పూర్తయింది. అంతకుముందు లడ్డూ వేలంపాట జరిగింది. బాలాపూర్​ లడ్డూ రికార్డు స్థాయిలో రూ. 24.6 లక్షలు పలికింది.  

చాంద్రాయణగుట్ట, ఫలక్​నుమా, చార్మినార్, ఎంజే మార్కెట్​, ఆబిడ్స్​ మీదుగా ట్యాంక్​బండ్​కు ప్రధాన ఊరేగింపు సాగగా.. కర్మన్​ఘాట్, గడ్డిఅన్నారం, రామంతాపూర్​, బేగంపేట, చిలకలగూడ, సికింద్రాబాద్​, అమీర్​పేట్​ మీదుగా ఇతర ఊరేగింపులు హుస్సేన్​సాగర్​కు చేరుకున్నాయి. ఉదయం 9 నుంచే ట్యాంక్​బండ్​ పరిసరాలు జనంతో నిండిపోయాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు చుట్టుపక్కల ఇసుకేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోయాయి. చాంద్రాయణగుట్ట నుంచి వచ్చే శోభాయాత్ర ఉదయం 7 గంటల నుంచే షురూ అయింది. మక్కా మసీదులో ప్రార్థనలు జరిగే సమయంలో గంట పాటు నిలిపివేశారు. తర్వాత యథావిధిగా యాత్ర సాగింది. చార్మినార్​ మీదుగా యాత్ర ప్రశాంతంగా సాగడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. 

35 వేల మందితో బందోబస్తు
గ్రేటర్​ హైదరాబాద్​లో నిమజ్జనం కోసం 35 వేల మంది బలగాలతో పోలుసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర జరుగుతున్న రూట్లలో ప్రత్యేకంగా 739 సీసీ కెమెరాలు అమర్చారు. ట్యాంక్​బండ్​ పరిసరాల్లో పది డ్రోన్​ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. డీజీపీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లోని కమాండ్ అండ్ కంట్రోల్‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌, బషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌‌‌‌‌ సీపీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లోని కంట్రోల్‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌ నుంచి శోభాయాత్రను పోలీసులు ట్రాక్ చేశారు. పాతబస్తీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించారు. భాగ్యనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గణేశ్ ఉత్సవ సమితితో కలిసి ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాలు పూర్తి చేశారు. 

రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది: డీజీపీ
రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా ముగిశాయని డీజీపీ మహేందర్​రెడ్డి అన్నారు. 10 లక్షల సీసీటీవీ కెమెరాలను హెడ్‌‌‌‌‌‌‌‌క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌కు కనెక్ట్‌‌‌‌‌‌‌‌ చేశామని, అన్ని జిల్లాల ఎస్పీలు, సీపీలతో కో‌‌ఆర్డినేట్‌‌‌‌‌‌‌‌ చేసుకున్నామని చెప్పారు. సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాపై స్పెషల్‌‌‌‌‌‌‌‌ మానిటరింగ్‌‌‌‌‌‌‌‌ సెల్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేశామని తెలిపారు. శనివారం ఉదయం కూడా హైదరాబాద్​లో నిమజ్జనాలు కొనసాగుతాయన్నారు.

బాలాపూర్ లడ్డూ 24 లక్షలు
బాలాపూర్ గణేశ్​ లడ్డూ మరోసారి రికార్డు సృష్టించింది. వేలంపాటలో రూ.24.6 లక్షలు పలికింది. పోయినేడుతో పోలిస్తే రూ.5.7 లక్షలు ఎక్కువ. ఈసారి వేలంలో ఆరుగురు స్థానికులు, ముగ్గురు స్థానికేతరులు పాల్గొన్నారు. పోటాపోటీగా వేలంపాట సాగింది. చివరకు బాలాపూర్ గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యుడు వంగేటి లక్ష్మారెడ్డి లడ్డూను దక్కించుకున్నారు.