కోచ్ ​ఫ్యాక్టరీపై ప్రకటన చేశాకే.. ప్రధాని రాష్ట్రానికి రావాలె

కోచ్ ​ఫ్యాక్టరీపై ప్రకటన చేశాకే.. ప్రధాని రాష్ట్రానికి రావాలె
  • ప్లానింగ్​ బోర్డు వైస్ ​చైర్మన్​  వినోద్​ డిమాండ్​​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర విభజన చట్టంలో హామీ ఇచ్చిన కాజీపేట రైల్వే కోచ్​ఫ్యాక్టరీపై స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాతే ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రావాలని ప్లానింగ్​ బోర్డు వైస్​ చైర్మన్​ బి.వినోద్​ కుమార్ డిమాండ్​ చేశారు. జులై 8న మోదీ వరంగల్​కు వస్తున్న నేపథ్యంలో వినోద్​ గురువారం మినిస్టర్స్​ క్వార్టర్స్​లో మీడియాతో మాట్లాడారు. వరంగల్​ఉమ్మడి జిల్లా ప్రజలు నాలుగు దశాబ్దాలుగా కోచ్​ఫ్యాక్టరీ కోసం ఎదురు చూస్తున్నారని, కానీ మోదీ కేవలం వ్యాగన్లు రిపేరు చేసే సెంటర్ ను​ ప్రారంభించేందుకు రావడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. కేంద్రంలో రైల్వే శాఖ మంత్రిగా ఎవరుంటే వారి రాష్ట్రాల్లో కోచ్​ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకుంటున్నారని, ‘ఇదేనా జాతీయ సమైక్యతా స్ఫూర్తి’ అని ఆయన ప్రశ్నించారు. 

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో కొత్తగా రైల్వే కోచ్​ఫ్యాక్టరీలు ఇవ్వడం లేదని ప్రకటించిందని, కానీ 2018లో లాథూరులో, 2022లో దాహాల్​లో కోచ్​ఫ్యాక్టరీల ఏర్పాటుకు అనుమతులతో పాటు నిధులిచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణకు విభజన చట్టం ప్రకారం హక్కు ఉన్న కోచ్​ఫ్యాక్టరీ ఇవ్వని కేంద్రం ఇతర రాష్ట్రాలకు వాటిని మంజూరు చేయడం న్యాయం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కోచ్​ ఫ్యాక్టరీపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని వినోద్​కుమార్ డిమాండ్​ చేశారు.