ఓయూ ఫ్యాకల్టీ, ఉద్యోగుల  సమస్యలు పరిష్కరిస్తం: వినోద్

ఓయూ ఫ్యాకల్టీ, ఉద్యోగుల  సమస్యలు పరిష్కరిస్తం: వినోద్

ఓయూ,వెలుగు:  ఓయూ ఫ్యాకల్టీ, ఉద్యోగుల  సమస్యలు పరిష్క రించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.  శనివారం ఓయూ ఆర్ట్స్ కాలేజీలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సాధన కోసం ఉద్యోగులు ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన​ చీఫ్​ గెస్ట్​గా హాజరై మాట్లాడారు.  వారం, పది రోజుల్లోగా ఉద్యోగుల సీపీఎస్ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని వెల్లడించారు. ఇందుకోసం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శితో సమావేశం కానున్నట్లు తెలిపారు. స్టూడెంట్లను రాజకీయాలకు దూరం చేయడాన్ని పెద్ద కుట్రగా ఆరోపించిన ఆయన.. విద్యా సంస్థల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు ఉండాల్సిందేనని పేర్కొన్నారు.

యూనివర్సిటీ రిక్రూట్ మెంట్ బోర్డు త్వరలోనే అమల్లోకి వస్తుందని, వెంటనే నియామకాల ప్రక్రియ ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆర్ట్స్ కాలేజీలో జరిగిన ‘ఎమర్జింగ్ చాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్’ అంశంపై సెమినార్​కు సైతం హాజరైన వినోద్ కుమార్ రీసెర్చ్​లపై ఫోకస్ చేయాలని ఫ్యాకల్టీ, స్టూడెంట్లకు సూచించారు. కార్యక్రమంలో ఓయూ వీసీ రవీందర్ యాదవ్, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ చింతా గణేశ్ తదితరులు పాల్గొన్నారు.