వైఎష్ షర్మిలపై వినోద్ కుమార్ ఫైర్

వైఎష్ షర్మిలపై వినోద్ కుమార్ ఫైర్
  • ఎన్నిరోజులు తిరిగినా ఆమెను తెలంగాణ బిడ్డ అనుకోరు
  • రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్​ కుమార్
  • షర్మిల అవార్డు వచ్చే రేంజ్​లో నటిస్తోంది : చీఫ్​ విప్​ వినయ్​భాస్కర్​ 

 హనుమకొండ, వెలుగు:  టీఆర్ఎస్​ లీడర్లు, సీఎం కేసీఆర్​ ఫ్యామిలీని తిట్టడానికే వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర చేపట్టారని రాష్ట్ర ప్లానింగ్​కమిషన్​ వైస్​ చైర్మన్​ బోయినపల్లి వినోద్​ కుమార్​ ఫైర్​అయ్యారు. ఆమె సరైన రాజకీయ క్షేత్రం ఎంచుకోలేదని, ఆంధ్రప్రదేశే ఆమె రాజకీయ క్షేత్రం అవుతుందన్నారు. తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో కాబోదని స్పష్టం చేశారు. ప్రభుత్వ చీఫ్ ​విప్​ దాస్యం వినయ్ భాస్కర్​ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్షా దివస్​ కార్యక్రమానికి వినోద్​కుమార్​ చీఫ్​ గెస్ట్​ గా హాజరయ్యారు. వరంగల్ మున్సిపల్​ కార్పొరేషన్​లోని దీక్షా దివస్​ పైలాన్​నుంచి హనుమకొండలోని అమరవీరుల స్తూపం వరకు చేపట్టిన బైక్​ ర్యాలీని ప్రారంభించారు. అంతకుముందు దీక్షా దివస్​ పైలాన్ ​వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో వినోద్​కుమార్ ​మాట్లాడారు. వైఎస్​ రాజశేఖర్​రెడ్డి పచ్చి తెలంగాణ వ్యతిరేకి అని, తెలంగాణకు అడ్డుపడ్డది ఆయనేనన్నారు. వైఎస్​ఆర్​కు తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఆయన కూతురుగా షర్మిల ఇప్పుడు రాష్ట్రంలో పాదయాత్రలు చేస్తున్నారని, రాష్ట్రంలో  ఎన్ని రోజులు పాదయాత్ర చేసినా ఆమెను తెలంగాణ బిడ్డగా ఎవరూ భావించరన్నారు. షర్మిల ఇప్పటికైనా రియలైజ్​అయి..ప్రజాక్షేత్రాన్ని మార్చుకోవాలని, ఏపీకి వెళ్లి పాదయాత్రలు చేసుకోవాలని సలహా ఇచ్చారు.

అసలు వైఎస్​జగన్​, షర్మిల ఇద్దరూ ఒక్కటేనా.. లేక వేర్వేరా అనేది అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వదిలిన కార్యకర్త షర్మిల అని, అమిత్​షాతో మాట్లాడిన తరువాతే ఆమె పాదయాత్ర స్టార్ట్​ చేసిందన్నారు. పాదయాత్రలతో జనాలను మభ్యపెట్టి కేసీఆర్​ను కించపరిచేలా ఉపన్యాసాలు ఇస్తోందని మండిపడ్డారు. నర్సంపేట ఎమ్మెల్యే గురించి అనవసర మాటలు మాట్లాడుతోందన్నారు. ఎమ్మెల్యేలను కించపరిచేలా మాట్లాడడం ఏమిటన్నారు. -రాజకీయాల్లో  విమర్శలు చేయాలి గానీ.. ఆమె మాట్లాడే భాష సరిగ్గా లేదన్నారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ భైంసాలో మత విద్వేషాలు రగల్చాలని చూస్తున్నాడని, దాన్ని రాష్ట్రమంతా వ్యాప్తి చేయాలని చూస్తున్నాడన్నారు. అంతకుముందు ప్రభుత్వ చీఫ్​ విప్​ దాస్యం వినయ్​భాస్కర్ ​మాట్లాడుతూ షర్మిల అవార్డు వచ్చే రేంజ్​లో నటిస్తున్నారని, దెబ్బలు తగలకున్నా బ్యాండేజీలు కట్టుకుని టీవీ డిబేట్లలో పాల్గొంటోందన్నారు. మేయర్​ గుండు సుధారాణి, రాష్ట్ర రుణ విమోచన కమిషన్​ చైర్మన్​ నాగుర్ల వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్​ అజీజ్​ఖాన్, కుడా మాజీ చైర్మన్​ మర్రి యాదవరెడ్డి, నాయకులు నాగేశ్వరరావు, జోరిక రమేశ్​ పాల్గొన్నారు.