Rajinikanth: 40 ఏళ్ల తర్వాత థియేటర్లలోకి తలైవా మూవీ.. పిచ్చెక్కిపోతున్న రజనీ ఫ్యాన్స్!

Rajinikanth: 40 ఏళ్ల తర్వాత థియేటర్లలోకి తలైవా మూవీ.. పిచ్చెక్కిపోతున్న రజనీ ఫ్యాన్స్!

భారతీయ సినీ ప్రపంచంలో కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకున్నా.. వివిధ కారణాలతో వెలుగులోకి రాకుండా డబ్బాల్లోనే మగ్గిపోతుంటాయి. అలాంటి చిత్రాల్లో వేలల్లోనే ఉన్నాయి. అయితే దాదాపు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. రజనీకాంత్ హీరోగా నటించిన ఒక భారీ మల్టీస్టారర్ హిందీ చిత్రం 'హమ్ మేన్ షాహెన్‌షా కౌన్' (Hum Mein Shahenshah Kaun) ఇప్పుడు థియేటర్లలోకి రావడానికి సిద్ధమైంది. 1980ల నాటి గోల్డెన్ ఎరాను కళ్లకు కట్టే ఈ సినిమా విడుదల వార్త ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

 అరుదైన కాంబినేషన్

1980వ దశకం చివరలో, అంటే దాదాపు 1989 నాటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఒక అద్భుతమైన తారాగణంతో రూపుదిద్దుకుంది. ఇందులో రజనీకాంత్‌తో పాటు శతృఘ్న సిన్హా, హేమమాలిని, అనితా రాజ్ వంటి దిగ్గజాలు నటించారు. విలక్షణ నటులు అమ్రిష్ పూరి, జగదీప్ వంటి వారు ఇప్పుడు మన మధ్య లేకపోయినా, ఈ సినిమా ద్వారా వారు మళ్ళీ వెండితెరపై జీవం పోసుకోనున్నారు. హర్మేష్ మల్హోత్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి లక్ష్మీకాంత్-ప్యారేలాల్ సంగీతం, ఆనంద్ బక్షి సాహిత్యం, సరోజ్ ఖాన్ కొరియోగ్రఫీ అందించారు.

విడుదల ఆగిపోవడానికి కారణం ఇదే?

ఈ సినిమా ఇన్నేళ్లు ఆగిపోవడానికి కారణం సెన్సార్ సమస్యలో లేక ఆర్థిక ఇబ్బందులో కాదు.. ఒక తండ్రికి ఎదురైన తీరని వ్యక్తిగత విషాదం. షూటింగ్ పూర్తయిన తర్వాత నిర్మాత రాజా రాయ్ వ్యాపార నిమిత్తం లండన్ వెళ్ళారు. అక్కడ ఆయన తన చిన్న కుమారుడిని కోల్పోయారు. ఆ పుత్రశోకం నుండి కోలుకోవడానికి ఆయనకు దశాబ్దాల సమయం పట్టింది. ఆ తర్వాత సినిమాను విడుదల చేయాలనుకునే లోపు దర్శకుడు హర్మేష్ మల్హోత్రా మరణించడం మరో పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఇలా కాలం ఈ ప్రాజెక్ట్‌ను నిశ్శబ్దంలోకి నెట్టేసింది.

ఏఐ (AI) తో కొత్త ఊపిరి.. 

దాదాపు 40 ఏళ్ల క్రితం 35mm ఈస్ట్‌మన్ కలర్ ఫిల్మ్‌పై షూట్ చేసిన ఈ చిత్రాన్ని నేటి కాలానికి అనుగుణంగా మార్చడం ఒక సవాలుతో కూడిన పని. అయితే, నిర్మాత రాజా రాయ్ అధునాతన సాంకేతికతను ఆశ్రయించారు.  పాత్రల నటనను, కథను మార్చకుండా కేవలం విజువల్స్ స్మూత్ చేయడానికి, ఆడియో నాణ్యత పెంచడానికి AIని వాడారు. పాత ఫిల్మ్ ను 4K క్వాలిటీలోకి మార్చారు. నేటి థియేటర్ల అనుభూతికి తగ్గట్లుగా సౌండ్ మిక్సింగ్ చేశారు.

విధిని జయించి.. 

"మేము ఎప్పుడూ ఆశ కోల్పోలేదు. ఈ సినిమా ఎన్నో కష్టాలను, నిశ్శబ్దాన్ని భరించింది. ఇది ప్రేక్షకుల ముందుకు రావడం విధి రాసిన రాత అని నిర్మాత రాజా రాయ్ పేర్కొన్నారు. సహ నిర్మాతలు అస్లాం మిర్జా, షబానా మిర్జా ఈ సినిమాను ఒక కళాఖండంలా భద్రపరిచారు. ఒక కాలం నాటి మేకింగ్ విలువలు, నేటి టెక్నాలజీ తోడై వస్తున్న 'హమ్ మేన్ షాహెన్‌షా కౌన్', పాత తరం ప్రేక్షకులకు నోస్టాల్జియాను అందించడమే కాకుండా, రజనీకాంత్ వింటేజ్ మేజిక్‌ను నేటి తరం యువతకు చూపేందుకు సిద్ధమైంది. త్వరలోనే ఈ చిత్రం దేశవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.