
శతాబ్దాల నాటి టైటానిక్ శిథిలాల వద్దకు డైవింగ్ చేస్తున్న సమయంలో ప్రయాణీకుల సబ్‌మెర్సిబుల్ పేలి ఐదుగురు మరణించిన విషయం తెలిసిందే. ఈ విపత్తు యావత్ ప్రపంచాన్ని ఆకర్షించింది. ఈ భయంకరమైన విషాదం, కారణం, ఫలితాన్ని సముద్ర శాస్త్రవేత్తలు ఇప్పటికే పలు రకాలుగా వెల్లడించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి తాజాగా మరో న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.
యూట్యూబ్ లో అప్ లోడ్ అవుతున్న వీడియోల్లో కొన్ని మాత్రమే ట్రెండింగ్ లో నిలుస్తూ ఉంటాయి. అందులో ఇప్పుడు మనం చెప్పుకోబోయే వీడియో ఒకటి. ఇది టైటాన్ సబ్‌మెర్సిబుల్ ఎలా పేలిపోయిందో తెలిపే యానిమేషన్ వీడియో. ఐటెల్లీ అనే యూట్యూబ్ ఛానెల్ షేర్ చేసిన ఈ వీడియో.. జూన్ 30న పోస్ట్ చేశారు. ఇధి 6 నిమిషాల 20 సెకన్ల నిడివి ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ వీడియో అప్ లోడ్ చేసిన 12 రోజుల్లోనే 6 మిలియన్ల వ్యూస్ ను దాటింది.
జూన్ 18న టైటానిక్ శిథిలాల వైపుకు చేరుకుంటారన్న రెండు గంటలలోపే రాడార్ నుంచి సబ్ అదృశ్యమైంది. నాలుగు రోజుల పాటు సాగిన ఈ శోధన ఆపరేషన్ తర్వాత, US కోస్ట్ గార్డ్ ఓడ పేలిపోయిందని.. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు మరణించారని అధికారులు వెల్లడించారు. అయితే ఈ మొత్తాన్ని కూడా ఈ యానిమేషన్ వీడియోలో చక్కగా, అర్థమయ్యేలా చూపించారు. ఇంప్లోషన్ అంటే ఏమిటి అనే దాని గురించి వీడియో వివరిస్తుంది. ఇంప్లోషన్ అనేది సబ్ ను కూల్చివేయడం ద్వారా విధ్వంసం చేసే ప్రక్రియ అని ఇది వివరిస్తుంది.
యానిమేషన్‌లో చూపిన విధంగా, చుట్టుపక్కల ఉన్న నీటి అధిక హైడ్రోస్టాటిక్ పీడనం కారణంగా పేలుడు సంభవించిందని యానిమేషన్ లో చూపించారు. "టైటానిక్ ఉన్న లోతు వద్ద, ప్రతి చదరపు అంగుళానికి 5వేల6వందల పౌండ్ల ఒత్తిడి ఉంటుంది. ఇది ఉపరితలంపై మనం అనుభవించే ఒత్తిడికి దాదాపు 4వందల రెట్లు ఎక్కువ. సబ్‌మెర్సిబుల్ సముద్రంలో లోతుగా ఉన్నందున, దాని ఉపరితలంపై తీవ్ర ఒత్తిడి మొదలవుతుంది. నీటి పీడనానికి, ఈ శక్తి తట్టుకోగలిగిన దానికంటే ఎక్కువ అయినప్పుడు, ఓడ పేలుతుంది" అని ఈ వీడియోలో వెల్లడించారు. ఈ అద్భుతమైన యానిమేషన్ పై వ్యూయర్స్ చాలా ఆసక్తిని కనబరుస్తున్నారు. అసలు ఏమైంది, ఎలా జరిగింది అన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఈ వీడియోను చూసేందుకు ఇష్టపడుతున్నారు.