- ఆ ఆడియో ఫేక్.. ఫోరెన్సిక్ టెస్టు చేయాలని డిమాండ్
- షోకాజ్ నోటీసుపై పీసీసీకి వివరణ
హైదరాబాద్, వెలుగు: తనపై వస్తున్న ఆరోపణలు, వైరల్ అవుతున్న ఆడియో క్లిప్పింగ్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ స్పందించారు. పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు ఆయన మూడు పేజీల లేఖతో వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడిపై, ఏ మహిళా నేతపై తాను ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. ఆ ఆడియో క్లిప్ పూర్తిగా ఏఐ సృష్టించిన మాయాజాలమన్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో క్లిప్ ఏడాది కింద జరిగినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని షబ్బీర్ అలీ మండిపడ్డారు. ఏఐ వాయిస్ క్లోనింగ్, మార్ఫింగ్ టూల్స్ ఉపయోగించి తన గొంతును సృష్టించారని తెలిపారు. అది ఫేక్ ఆడియో అని, దీనిపై సైంటిఫిక్ ఫోరెన్సిక్ టెస్ట్ చేయాలని, అప్పుడే నిజాలు బయటపడతాయన్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై కామారెడ్డి టౌన్ పీఎస్‌లో ఎఫ్ఐఆర్ నమోదైందని, దీని వెనుక ఉన్న కుట్రదారులు ఎవరనేది పోలీసులు విచారిస్తున్నారని తెలిపారు.
బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయి కాంగ్రెస్‌లో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి జాయిన్ అయ్యారని, ఒక బృందం గ్రూపిజం ప్రోత్సహిస్తూ, కాంగ్రెస్‌ను బలహీనపరిచేందుకు సీనియర్ నాయకులను టార్గెట్ చేశారన్నారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తనకు నాలుగు దశాబ్దాలుగా తెలుసని, ఆయన తన తమ్ముడు, మంచి మిత్రుడని పేర్కొన్నారు. తమ మధ్య దూరం పెంచేందుకే దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ నాయకత్వం, మహిళా కార్యకర్తల మధ్య చిచ్చు పెట్టడానికి రాజకీయ ప్రేరేపితంతో చేసిన కుట్ర అని ఆయన లేఖలో వివరించారు. 45 ఏళ్లుగా కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నానని, భవిష్యత్తులోనూ తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతం కోసమే పనిచేస్తానని పేర్కొన్నారు.
