రాష్ట్రాన్ని వణికిస్తున్న వైరల్ ఫీవర్స్

రాష్ట్రాన్ని వణికిస్తున్న వైరల్ ఫీవర్స్
  • ఒక్కో బెడ్​పై ఇద్దరేసి రోగులకు ట్రీట్​మెంట్​
  • ఫలితమివ్వని పల్లె, పట్టణ ప్రగతి పనులు
  • దోమల నివారణకు కానరాని స్పెషల్​డ్రైవ్​లు
  • పెరుగుతున్న డెంగీ, మలేరియా కేసులు
  • జ్వర మరణాలను లెక్కించని ఆఫీసర్లు


 
రాష్ట్రాన్ని వైరల్​ ఫీవర్స్​ వణికిస్తున్నాయి. డెంగీ, మలేరియా, టై ఫాయిడ్‌‌‌‌‌‌‌‌, ఇతర విషజ్వరాలతో జనం విలవిల్లాడుతున్నారు. పల్లె, పట్టణం తేడా లేకుండా రోజురోజుకూ జ్వరాల బారిన పడుతున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది. జ్వర పీడితులతో ప్రభుత్వ, ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్స్ నిండిపోతున్నాయి. కొన్ని జిల్లా ఆస్పత్రుల్లో ఒక్కో బెడ్​పై ఇద్దరేసి రోగులను పడుకోబెట్టి ట్రీట్​మెంట్ చేస్తున్నారు. హైదరాబాద్​లోని నల్లకుంట ఫీవర్​ హాస్పిటల్​ కు  రోజూ 700 మంది పేషెంట్లు వస్తుంటే ఇందులో 50 శాతం జ్వరాలతో బాధపడుతున్నవాళ్లే. పట్టణాలు, గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం వల్లే  దోమలు ఎక్కువై  వైరల్​ ఫీవర్స్​వస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సీజన్​లో  హైదరాబాద్​ మినహా జిల్లాల్లో సుమారు 50 మంది దాకా డెంగీ, వైరల్ ఫీవర్స్​తో చనిపోగా, ఆఫీసర్లు మాత్రం  ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోలేదని చెబుతున్నారు. కేసులను కూడా తక్కువ చేసి చూపుతున్నారు. ఆఫీసర్ల లెక్క ప్రకారం చూసినా ఈ నెల 24 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,758 డెంగీ, 532 మలేరియా కేసులు నమోదయ్యాయి. 

హైదరాబాద్‌‌లో అత్యధికంగా 598 డెంగీ కేసులు రాగా, ఆ తర్వాతి స్థానాల్లో ఖమ్మం, రంగారెడ్డి, మేడ్చల్, కొత్తగూడెం, ఆదిలాబాద్‌‌ జిల్లాలు ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా 225 మలేరియా కేసులు రాగా, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోనూ మలేరియా ప్రభావం ఎక్కువగా ఉంది.

కిటకిటలాడుతున్న హాస్పిటల్స్

రాష్ట్రంలోని ఆసుపత్రులన్ని జ్వర బాధితులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్​లోని నల్లకుంట ఫీవర్​ హాస్పిటల్​కు కొద్దిరోజులుగా జిల్లాల నుంచి  రెఫరల్ కేసులు పెరుగుతున్నాయి. ఒక్కో ఏరియా హాస్పిటల్​కు రోజు 500 మంది దాకా ఓపీకి వస్తుండగా వారిలో సగానికిపైగా జ్వరాలతో బాధపడుతున్నోల్లే ఉంటున్నారు. ఈ నెలలో సిటీలో ఇప్పటి వరకు185 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఆదిలాబాద్ రిమ్స్​కు సాధారణ రోజుల్లో 500 ఓపీ ఉంటుంది. కానీ వారం రోజులుగా 800కు పైగా ఓపీ నమోదవుతోంది. ఈ ఒక్క ఆసుపత్రిలోనే ఇన్​పేషెంట్స్ 500 కు చేరగా, అందులో సగానికి పైగా ఫీవర్స్​తో బాధపడుతున్నవాళ్లే. నిర్మల్ జిల్లా ఆసుపత్రిలో ఓపీ సగటున 200 ఉంటే కొద్దిరోజులుగా500 దాటుతోంది. 100 నుంచి 200 లోపు ఇన్​పేషెంట్లు ఉండడంతో ఒక్కో బెడ్​పై ఇద్దరి చొప్పున పడుకోబెట్టి ట్రీట్​మెంట్ ఇస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతమైన కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడి సీహెచ్​సీలో రోజుకు  250 దాకా ఓపీ నమోదవుతోంది. ఇక్కడి జనరల్​వార్డులు నిండిపోవడంతో.. హాల్ లో బెడ్స్ వేసి ట్రీట్​మెంట్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం హాస్పిటల్​లో రోజూ 300కు పైగా ఓపీ నమోదవుతోంది. వీరిలో కనీసం వంద మంది వైరల్ ఫీవర్ బాధితులు ఉంటున్నారని డాక్టర్లు చెబుతున్నారు. ఈ జిల్లాలో ఇప్పటివరకు 105 డెంగీ, 229 మలేరియా కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సాధారణంగా 200 ఓపీ మించకపోయేది. ప్రస్తుతం 300 నుంచి 350 వరకు వస్తున్నారు. జిల్లాలో 82 మంది డెంగీతో బాధపడుతున్నారు. పె ద్దపల్లిలో 40 మంది ఫీవర్స్​తో బాధపడుతుండగా, బుధవారం కొత్తగా 8 మందికి డెంగీ సోకింది. మెదక్ జిల్లా హాస్పిటల్​కు సగటున 400కు మించని ఓపీ, ఇప్పుడు 600 దాటుతోంది. సూర్యాపేట జిల్లా హాస్పిటల్​కు 150 ఓపీ వస్తుండగా వాటిలో 60కి పైగా వైరల్ ఫివర్ కేసులే నమోదవుతున్నాయి. ఈ జిల్లాలో ఏకంగా 91 డెంగీ కేసులు వచ్చాయి. నాగర్ కర్నూలు ఏరియా హాస్పిటల్ జనరల్ వార్డులన్నీ వైరల్​ఫీవర్ బాధితులతో నిండిపోతున్నాయి. నిజామాబాద్ జీజీహెచ్​లో రోజుకు 800కు పైగా ఓపీ వస్తోంది. వీరిలో సగం మంది జ్వరపీడితులే.  ఖమ్మం ప్రధాన ఆసుపత్రిలో 600 నుంచి 700 ఓపీ నమోదవుతుంటే వీరిలో 400 మందికి తలనొప్పి, జ్వరం ఇతర వైరల్​ఫీవర్ లక్షణాలు ఉంటున్నాయి. మంచిర్యాల జిల్లాలో ప్రతి రోజూ 100కు పైగా వైరల్ ఫీవర్స్ కేసులు వస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.

పెరుగుతున్న మరణాలు..

డెంగీ, మలేరియా, ఇతర వైరల్ ఫీవర్స్​తో ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ ఒక్కరూ చనిపోలేదని హెల్త్ ఆఫీసర్లు చెబుతున్నా జిల్లాల్లో మాత్రం రోజూ ఒకరిద్దరు మృతిచెందుతున్నారు. ఈ సీజన్​లో ఇప్పటికే 50 దాకా మరణాలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లాలో వైరల్ ఫీవర్ తో 15 మంది, డెంగీతో 8 మంది, మంచిర్యాల జిల్లాలో డెంగీతో ఒకరు, వైరల్​ఫీవర్స్​తో ముగ్గురు, సంగారెడ్డి జిల్లాలో డెంగీతో ఇద్దరు, వైరల్ ఫీవర్ తో ఒకరు, కరీంనగర్ జిల్లాలో వైరల్​ఫీవర్​తో ఒకరు, వనపర్తి జిల్లాలో డెంగీతో ఒకరు, భూపాలపల్లి జిల్లాలో వైరల్​ఫీవర్​తో ఒకరు, జగిత్యాల జిల్లాలో వైరల్ ఫీవర్ తో ఇద్దరు మృతి చెందారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో నూ డెంగ్యూ లక్షణాలతో నలుగురు, మలేరియా లక్షణాలతో ముగ్గురు చనిపోయారు. ఇలా ప్రభుత్వ, ప్రైవేట్​దవాఖాన్లలో, ఇళ్ల వద్ద డెంగీ, మలేరియా, ఇతర విషజ్వరాలతో చనిపోతున్నవారి వివరాలు పేరు, ఊరుతో సహా పేపర్లు, చానెళ్లలో వస్తున్నా ఏ జిల్లాలోనూ హెల్త్ ఆఫీసర్లు వీటిపై స్పందించడం లేదు. అదే సమయంలో అవి జ్వర మరణాలే అని గుర్తించడం లేదు. ఆఫీసర్ల నిర్లక్ష్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

స్పెషల్ డ్రైవ్​లు లేవు

హాస్పిటల్ వచ్చే పేషెంట్లకు ట్రీట్​మెంట్ ఇవ్వడం వరకే హెల్త్ డిపార్ట్​మెంట్ పని. దోమల నివారణ సంగతిని మున్సిపల్, పంచాయతీరాజ్ డిపార్ట్‌‌మెంట్లే చూసుకోవాలి. కానీ, సరిపడా ఫండ్స్, స్టాఫ్ లేక పంచాయతీలు, మున్సిపాలిటీల్లో శానిటైజేషన్​ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఫలితంగా దోమలు పెరిగి, జ్వరాలు ప్రబలుతున్నాయి. ఇటీవల హైదరాబాద్, వనపర్తి, మేడ్చల్, నిర్మల్, రంగారెడ్డి, మహబూబ్‌‌నగర్‌‌‌‌, ఆదిలాబాద్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో హెల్త్​ డిపార్ట్​మెంట్ చేపట్టిన సర్వేలో 35 నుంచి 50 శాతం ఇండ్లల్లోని నీటి ట్యాంకులు, కుండీలు, తొట్లలో దోమ లార్వా కనిపించిందని స్వయంగా పబ్లిక్ హెల్త్​డైరెక్టర్ శ్రీనివాసరావు ఈ నెల 18న చెప్పారు. వాస్తవానికి పల్లె, పట్టణ ప్రగతి పేరిట ప్రభుత్వం జులై 1నుంచి 10 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించింది. ఇందుకోసం  రాష్ట్ర సర్కారు జిల్లాకు కోటి రూపాయల చొప్పున మొత్తం రూ.32 కోట్లు రిలీజ్​ చేసింది. ఇవి ఏ మూలకూ చాలకపోవడంతో అన్నిచోట్లా తూతూమంత్రంగానే పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఆ తర్వాత నెలరోజులు గడిచినా గ్రామాలు, మున్సిపాలిటీల్లో ఎలాంటి స్పెషల్​డ్రైవ్​లు చేపట్టలేదు. అందులోనూ దోమల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దోమలు వృద్ధి చెందకుండా పంచాయతీలు, మున్సిపాలిటీల్లో గతంలో మురుగునీటి గుంటల్లో నాఫ్తలిన్ బాల్స్ వేయడం, గంబూషియా చేపపిల్లలను వదలడం, వారంలో ఏదో ఒక రోజు డ్రైడే పాటించడం, ఇండ్లలోని కొబ్బరిబోండాలు, ఖాళీ టైర్లు, డ్రమ్ములను, తొట్లను ఖాళీ చేయించడం లాంటి చర్యలు చేపట్టేవాళ్లు. కానీ పల్లె, పట్టణ ప్రగతి తర్వాత ఉన్నతాధికారులు ఈ విషయాన్నే మరిచిపోయారు. ఇటీవల నిర్మల్​ టౌన్​లోని పలు స్లమ్ ఏరియాల్లో డెంగీ జ్వరాలు ప్రబలి వందలాది మంది ఆసుపత్రుల పాలు కావడంతో స్థానికులు ఏకంగా కలెక్టరేట్​ను ముట్టడించారు. గాజులపేట, గంజ్ బకష్  తదితర ఏరియాకు చెందిన ప్రజలు రాస్తారోకో చేపట్టి సర్కారు తీరుపై నిరసన తెలిపారు. పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడం వల్లే దోమలు పెరిగి తాము జ్వరాలబారిన పడుతున్నామని విమర్శించారు. వెంటనే శానిటేషన్​చర్యలు చేపట్టాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూకీకి వినతిపత్రం సమర్పించారు.  ఇది జిల్లాల్లో పరిస్థితిని వెల్లడిస్తోంది.

మా మునగాల మొత్తం జ్వరాలే..

మా మునగాలలో ఎటుచూసినా జ్వరపీడితులే కనిపిస్తున్నరు. రెడ్డి నగర్, ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీ ల్లో పారిశుద్ధ్యం సక్కగ లేక దోమలు పెరిగి వందల మంది జ్వరాలబారిన పడ్డరు. నాకు, నా భర్తకు వైరల్ ఫీవర్ వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రికి పోతే ఎట్లుంటదో ఏమోనని ప్రైవేట్​లో చికిత్స చేయించుకున్నం. ఇద్దరికీ కలిపి సుమారు రూ.40 వేల వరకు ఖర్చయింది. ప్రభుత్వం కనీసం శానిటేషన్ గురించైనా పట్టించుకోకుంటే ఎట్ల?
                                                                                                                                  - అలుగుబెల్లి ప్రమీల, సూర్యాపేట జిల్లా