కాబూల్‌లో దీనస్థితి.. గాలిలో ఫ్లైట్ నుంచి జారిపడిన ముగ్గురు

కాబూల్‌లో దీనస్థితి.. గాలిలో ఫ్లైట్ నుంచి జారిపడిన ముగ్గురు

అఫ్గానిస్థాన్ తాలిబన్ల చేతిలోకి వెళ్లిపోవడంతో ఆ దేశ ప్రజలు భయంతో వణికిపోతున్నారు. దేశంలో బతికే వాళ్లకు కనీస హక్కులు, రక్షణ లాంటివి ఉండవని ఆందోళన చెందుతున్నారు. అనేక మంది విదేశాలకు వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఈ రోజు ఉదయం కాబూల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి అఫ్గాన్ ప్రజలు, ఆ దేశంలో ఉంటున్న విదేశీయులు వందల, వేల సంఖ్యలో చేరుకున్నారు. చాలా దేశాలు ఫ్లైట్ ఆపరేషన్స్ రద్దు చేసుకోవడంతో మిగిలి ఉన్న చివరి విమానాల్లో అక్కడి నుంచి బయటపడేందుకు ప్రయత్నించారు. మన దగ్గర గతంలో సెలవుల సమయంలో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు తోసుకుంటూ బస్సులు, రైళ్లలోకి ఎక్కడం లాంటి సీన్లు ఆ ఎయిర్‌‌పోర్టులో కనిపించాయి. అఫ్గాన్ ప్రజల్లో నెలకొన్న భయానికి ఈ దృశ్యాలు అద్దం పడుతున్నాయి.

అమెరికాకు చెందిన మిలటరీ ప్లేన్ ఒకటి కాబూల్ నుంచి తిరిగి వెళ్తుంటే రన్‌ వేపై దాని వెంట అఫ్గాన్ జనాలు పరుగులు పెట్టారు. ఏదో ఒక మూలన పట్టుకుని ఆ దేశం దాటితే చాలన్నట్టుగా ఫ్లైట్ వెంటపడ్డారు. కొందరు ఆ రెక్కలు, టైర్ల పైభాగంలో ఉండే షీల్డ్‌పై గట్టిగా పట్టుకుని కూర్చున్నారు. అయితే ఇలా ఫ్లైట్ టేకాఫ్ తీసుకుని ఆకాశంలోకి ఎగసిన కొద్దిసేపటికే కిందపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలను అఫ్గాన్ టీవీ చానెల్ టోలో టెలికాస్ట్ చేసింది. ఇద్దరు ముగ్గురు అఫ్గాన్ పౌరులు యూఎస్‌ ప్లేన్ రెక్కలను పట్టుకుని దేశం దాటే ప్రయత్నం చేశారని, కానీ గాలిలోకి ఎగసిన తర్వాత కింద పడి మరణించారని పేర్కొంటు ఆ చానెల్‌కు చెందిన రిపోర్టర్ తారిక్‌ మాజిదీ ట్వీట్ చేశారు. ఇది వైరల్ కావడంతో అఫ్గాన్‌లో ఎంతటి దీన పరిస్థితులు నెలకొన్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.