విరాట్ ది ఛేజింగ్ మాస్టర్..

విరాట్  ది ఛేజింగ్ మాస్టర్..

టార్గెట్‌‌‌‌‌‌ 160 రన్స్‌‌‌‌. ఏడు ఓవర్లు ముగిశాయో లేదో నలుగురు బ్యాటర్లు తిరిగొచ్చేశారు. ఫలితం  31/4.  వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో పాక్‌‌‌‌ చేతిలో మరో అవమానం తప్పదని ఇండియా ఆటగాళ్ల నిరాశ.. ఎంసీజీలో 60 వేల మంది ఇండియన్‌‌‌‌ ఫ్యాన్స్‌‌‌‌లో నిశ్శబ్దం..!  టీవీల ముందున్న కోట్లాది మంది అభిమానుల్లో నిర్వేదం! ఇక అద్భుతం జరిగితే తప్ప ఇండియా గెలవదని అనుకున్న సమయంలో  నిజంగానే అద్భుతం జరిగింది. ఆ అద్భుతం పేరు విరాట్‌‌‌‌ కోహ్లీ. పరాజయం తరుముకొస్తున్న సమయంలో.. ప్రతికూల పరిస్థితుల్లో  మాస్టర్‌‌‌‌ క్లాస్‌‌‌‌ ఆటతో  అతను టీమిండియా పరువు కాపాడాడు. తన పనైపోలేదని, తనలో గెలుపుకాంక్ష తగ్గలేదని చాటిచెప్పాడు..!  అభిమానులు ముద్దుగా కింగ్‌‌‌‌  అని పిలుచుకునే విరాట్‌‌‌‌ తనెప్పుడూ కింగే అనిపించుకున్నాడు..! అతని ఆటకు ఎవ్వరైనా సలాం కొట్టాల్సిందే!

(వెలుగు స్పోర్ట్స్​ డెస్క్​)
విరాట్‌‌‌‌ కోహ్లీ గతంలో ఎన్నోసార్లు ఇండియాను గెలిపించాడు. ఓటమి అంచుల్లో ఉన్న జట్టును ఒంటిచేత్తో  విజయతీరాలకు చేర్చడం అతనికి కొత్తేం కాదు. ఎంతో ప్రెజర్‌‌ ఉండే ఛేజింగ్‌‌లో అతని క్లాసిక్‌‌ ఇన్నింగ్స్‌‌లను మనం చాలానే చూశాం.  కానీ, ఈ మ్యాచ్​.. ఈ ఇన్నింగ్స్​.. ఈ గెలుపు.. ఇండియాకే కాదు కోహ్లీకి కూడా చాలా ప్రత్యేకం. ఎందుకంటే రెండు, మూడేళ్ల నుంచి కోహ్లీ ఆటలో మునుపటి వాడి తగ్గిందన్న విమర్శలు వస్తున్నాయి. తను సున్నాలు చుట్టకున్నా.. సింగిల్​ డిజిట్స్‌‌కు పరిమితం కాకున్నా..  అభిమానులు ఆశించిన స్థాయిలో పెద్ద ఇన్నింగ్స్‌‌లు ఆడకపోవడంతో కోహ్లీ పనైపోయిందన్న అంచనాకు వచ్చేశారు. గతేడాది యూఏఈలో జరిగిన టీ20 వరల్డ్‌‌కప్‌‌లో ఇదే పాకిస్తాన్‌‌ చేతిలో టీమిండియా ఓడిపోవడం.. ఆ దెబ్బకు మన జట్టు సెమీస్‌‌ చేరకుండానే ఇంటిదారి పట్టడం.. ఆ తర్వాత  అనూహ్య పరిణామాల మధ్య వన్డే, టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం విరాట్‌‌ కెరీర్‌‌లో చేదుజ్ఞాపకాలు. వీటికి తోడు జట్టును గెలిపించే ఇన్నింగ్స్‌‌లు ఆడకపోవడం, తరచూ విరామం తీసుకోవడంతో ఓ దశలో కోహ్లీని షార్ట్‌‌ ఫార్మాట్‌‌ నుంచి తప్పించాలన్న డిమాండ్లూ వచ్చాయి. స్టార్‌‌ ప్లేయర్‌‌ అయినంత మాత్రాన బాగా ఆడకున్నా కొనసాగిస్తారా? అడిగినప్పుడల్లా బ్రేక్​ ఎలా ఇస్తారు? అంటూ సునీల్​గావస్కర్​ వంటి మాజీలు ప్రశ్నించారు. కానీ, ఈ విమర్శలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకెళ్లిన విరాట్‌‌ మొన్నటి ఆసియా కప్‌‌లో తిరిగి ఫామ్‌‌ అందుకున్నాడు.  హాంకాంగ్‌‌, పాకిస్తాన్‌‌పై ఫిఫ్టీలతో పాటు అఫ్గానిస్తాన్‌‌పై వంద కొట్టి మూడేళ్ల సెంచరీ దాహాన్ని తీర్చుకున్నాడు. అయినా ఈ వరల్డ్‌‌కప్‌‌ ముంగిట అందరి దృష్టి వరల్డ్​ నం.2 సూర్యకుమార్‌‌పైనే నిలిచింది. కెప్టెన్​గా తొలి వరల్డ్​ కప్​ ఆడుతున్న రోహిత్​శర్మ  ఏం చేస్తాడనే చర్చ నడిచింది. కానీ, తొలి మ్యాచ్‌‌లోనే కోహ్లీ విలువ ఏంటో అందరికీ తెలిసొచ్చింది.     

మాస్టర్‌‌ క్లాస్‌‌
ఈ మ్యాచ్‌‌లో కోహ్లీ ఇన్నింగ్స్‌‌ ఓ మాస్టర్‌‌ క్లాస్‌‌.  ఇన్నింగ్స్‌‌ను ఎలా నిర్మించాలో.. ప్రత్యర్థిపై పైచేయి ఎలా సాధించాలో కోహ్లీకి బాగా తెలుసు. ఇన్నేళ్ల తన ఎక్స్‌‌పీరియన్స్‌‌తో హార్దిక్‌‌ పాండ్యాతో కలిసి విరాట్‌‌ జట్టును ట్రాక్‌‌లోకి తెచ్చిన విధానం యువ క్రికెటర్లకు గెలుపు పాఠం.  రెండో ఓవర్లోనే క్రీజులోకి వచ్చిన తను 12వ ఓవర్‌‌కు గానీ బంతిని గాల్లోకి లేపలేదంటే అతను ఎంత అప్రమత్తంగా బ్యాటింగ్‌‌ చేశాడో అర్థం చేసుకోవచ్చు. పాక్‌‌ లెఫ్టార్మ్‌‌ పేసర్లు షాహీన్‌‌, రవూప్‌‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌‌ చేయడంతో గ్రౌండ్‌‌ షాట్లతో సింగిల్స్‌‌, డబుల్స్‌‌తో  ఒక్కో పరుగు జత చేసిన అతను హార్దిక్‌‌ను స్వేచ్ఛగా ఆడేలా ప్రోత్సాహించాడు. గేరు మార్చాల్సిన టైమ్‌‌ వచ్చిన వెంటనే తనలోని హిట్టర్‌‌ను నిద్రలేపాడు. అప్పటిదాకా గౌరవించిన షాహీన్‌‌, రవూఫ్‌‌లపై ఎదురుదాడి చేసి వారిపై ఒత్తిడి పెంచాడు. చివర్లో పాండ్యా ఇబ్బంది పడ్డ టైమ్‌‌లో భారీ షాట్లు ఆడే బాధ్యత విరాట్‌‌ తీసుకున్నాడు.  ముఖ్యంగా రవూఫ్​ వేసిన 19వ ఓవర్లో బ్యాక్​ఫుట్​పై లాంగాన్​ మీదుగా అతను కొట్టిన సిక్స్ నభూతో అనొచ్చు. తర్వాతి బాల్‌‌కు కూడా సిక్సర్‌‌  కొట్టి ఇండియాను రేసులో నిలిపిన విధానం చూసిన తర్వాత కోహ్లీ టీ20ల నుంచి తప్పుకోవాలన్న వాళ్లు కచ్చితంగా పశ్చాతాపం చెందాల్సిందే. 

విరాట్‌‌ ఓ ఎమోషన్‌‌
ఈ తరంలో విరాట్​ బెస్ట్​ క్రికెటర్, బెస్ట్​ బ్యాటర్, బెస్ట్​ ఫీల్డర్,​ బెస్ట్​ ఛేజ్ మాస్టర్ అనడంలో సందేహం లేదు. ​విరాట్​ ఓ ఎమోషన్ కూడా. బ్యాటింగ్​కు వచ్చిన ప్రతీసారి క్రికెట్​ ప్రపంచం చూపంతా తనమీదే ఉండేలా చూసుకుంటాడు. కోహ్లీని ఇష్టపడేవాళ్లంతా మైదానంలో అతని ప్రతీ మూవ్​మెంట్‌‌ను​ఆస్వాదించడం సహజమే. కానీ, కోహ్లీ అంటే గిట్టని వాళ్లు సైతం అతను కొట్టే షాట్లను చూసి వావ్​ అనాల్సిందే. ఇలాంటి ఇన్నింగ్స్​తర్వాత విరాట్​కు ఎవ్వరైనా సలాం  కొట్టాల్సిందే. కోహ్లీ ఆడుతున్నంత కాలం.. టీమిండియా నుంచి  ఆ ఎమోషన్‌‌ను విడదీయలేం. మ్యాచ్​ గెలిచిన తర్వాత కోహ్లీని కెప్టెన్​ రోహిత్​ ఎత్తుకోవడం ఈ మ్యాచ్​లో కనిపించిన మరో హైలైట్ సీన్. అంతకుముందు టార్గెట్​ పూర్తికాగానే  కోహ్లీ చేసిన విజయ గర్జన.. పిడికిలి బిగించి  గ్రౌండ్​కు పంచ్​లు ఇవ్వడం  చూస్తే ఇంకా సాధించాలన్న తపన, గెలుపు కాంక్ష, కసి విరాట్​లో ఏమాత్రం తగ్గలేదని స్పష్టం అవుతోంది. విరాట్​ఇదే జోరును కొనసాగించాలని.. టీమిండియా కప్పు నెగ్గాలని కోరుకుందాం! 

పాక్ కా బాప్
ఇండియా, పాక్​ మ్యాచ్​ అంటేనే  ఇరు జట్ల ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి టోర్నీల్లో అయితే ఈ ప్రపంచం భారం మొత్తాన్ని భుజాలపై మోస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ, ఐసీసీ ఈవెంట్ల (వన్డే, టీ20 వరల్డ్‌‌‌‌కప్స్‌‌, చాంపియన్స్‌‌ ట్రోఫీ) పాక్‌‌పై 625 రన్స్‌‌తో ఇండియా టాప్‌‌ స్కోరర్‌‌గా నిలిచాడు విరాట్‌‌. అంతేకాదు పాక్‌‌పై  సగటు (108), ఫిఫ్టీలు (6), నాటౌట్స్‌‌ (5), ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌ అవార్డుల్లోనూ తనే ముందున్నాడు. అందుకే ఇప్పుడు విరాట్‌‌ను ఫ్యాన్స్ పాక్‌‌కా బాప్‌‌ అంటున్నారు.

ఏం జరిగిందో నమ్మలేకపోతున్నా

ఈ విజయం గురించి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. అసలు ఏం జరిగిందో నమ్మలేకపోతున్నా. చివరి వరకు క్రీజులో ఉండమని హార్దిక్‌ చెబుతూనే ఉన్నాడు. మనపై నమ్మకం పెట్టుకుంటే గెలుస్తామని అన్నాడు. నవాజ్‌కు ఓ ఓవర్‌ ఉంది కాబట్టి.. 19వ ఓవర్లో రవూఫ్‌ను బాగా ఆడితే పాక్‌ భయపడుతుందని అంచనా వేశాం. ఆ  లాంగాన్‌లో సిక్సర్‌ నేను ఊహించలేదు. తర్వాతి సిక్సర్​కు బ్యాట్‌ టచ్‌ చేశాను అంతే. ఇప్పటి వరకు మొహాలీ ఇన్నింగ్స్‌ బెస్ట్‌ అని చెప్పా. ఇప్పుడు ఈ ఇన్నింగ్స్‌ చాలా  ప్రత్యేకమైందే. ఎందుకంటే పరిస్థితి, సందర్భం దీన్ని అందనంత ఎత్తుకు 
తీసుకెళ్లాయి.  ‑ కోహ్లీ