సచిన్ ఫీట్‌ను అతడే అందుకోగలడు: పఠాన్

సచిన్ ఫీట్‌ను అతడే అందుకోగలడు: పఠాన్

న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ క్రికెట్‌ నుంచి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నుంచి రిటైరై దాదాపు ఏడేళ్లు కావొస్తోంది. కానీ బ్యాటింగ్‌లో సచిన్ నెలకొల్పిన ఎన్నో రికార్డులు ఇంకా చెక్కు చెదరలేదు. ముఖ్యంగా సచిన్ 100 అంతర్జాతీయ సెంచరీలు అతడి 24 ఏళ్ల కెరీర్‌‌లో చిరస్థాయిగా నిలిచిందనే చెప్పాలి. అయితే అసాధ్యమైన సచిన్ రికార్డులను బ్రేక్ చేసే దిశగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వడివడిగా దూసుకెళ్తున్నాడు. అన్ని ఫార్మాట్స్‌లోనూ అద్భుతమైన ఫామ్‌తో చెలరేగుతూ మాస్టర్ రికార్డులను బ్రేక్ చేసేలా కనిపిస్తున్నాడు. గత 12 ఏళ్లలోనే కోహ్లీ 70 ఇంటర్నేషనల్ సెంచరీలు కొట్టడమే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు.

సచిన్ రికార్డులను తిరగరాయడంలో కోహ్లీని బలమైన కంటెండర్‌‌గా క్రికెట్ ఎక్స్‌పర్ట్స్‌ అంచనా వేస్తున్నారు. అత్యధిక సెంచరీల విషయంలో సచిన్ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ నిలిచాడు. పంటర్ తన ఓవరాల్ కెరీర్‌‌లో 71 సెంచరీలు కొట్టాడు. ఈ నేపథ్యంలో సచిన్ సెంచరీల రికార్డుపై మాజీ టీమిండియా ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. మాస్టర్ రికార్డును కోహ్లీ బ్రేక్ చేస్తాడని అతడు విశ్వాసం వ్యక్తం చేశాడు.

‘కచ్చితంగా వంద సెంచరీలు కొడతాడు. సచిన్ తర్వాత ఆ ఫీట్‌ను ఎవరైనా అందుకోగలరు అంటే అది కచ్చితంగా కోహ్లీనే. అతడు (కోహ్లీ) ఎంత సాధించాడనేది అందరికీ తెలుసు. అది కూడా చాలా తక్కువ టైమ్‌లో. సచిన్ వంద సెంచరీల రికార్డును అందుకున్నప్పుడు నేను అతడితో ప్రయాణం చేశా. అయితే సచిన్ రికార్డును ఎవరైనా బ్రేక్ చేయగలిగితే అతడు భారతీయుడే అయి ఉండాలనేది నా కోరిక. విరాట్‌కు ఆ సామర్థ్యం, ఫిట్‌నెస్ ఉంది. ఆ రికార్డును చేరుకోవడానికి ఇవి చాలా అవసరం. నాకు తెలిసి అతడు ఇంకో 30 సెంచరీల దూరంలో ఉన్నాడు. రిటైరయ్యే లోపు కోహ్లీ ఈ రికార్డును తిరగరాస్తాడని భావిస్తున్నా. ఆ లక్ష్యం అతడి మైండ్‌లో ఉండి ఉంటుంది’ అని స్టార్ స్పోర్స్‌లో ప్రసారమయ్యే క్రికెట్‌ కనెక్టెడ్‌ అనే షోలో పఠాన్ పేర్కొన్నాడు.