కింగ్ కోహ్లీనా మజాకా... ఒక్క సెంచరీ..అరుదైన రికార్డులు...

కింగ్ కోహ్లీనా మజాకా... ఒక్క సెంచరీ..అరుదైన రికార్డులు...

ఐపీఎల్లో చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో అద్భుతమైన సెంచరీతో ఆర్సీబీకి  విజయాన్ని అందించిన విరాట్ కోహ్లీ రికార్డులను తిరగరాశాడు.  ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో క్రిస్ గేల్ రికార్డును సమం చేశాడు.  ఐపీఎల్ లో గేల్ 6 సెంచరీలు సాధించగా... విరాట్ కోహ్లీ తాజా సెంచరీతో గేల్ తో కలిసి  అగ్రస్థానంలో నిలిచాడు.

ఐపీఎల్ లో కోహ్లీ 2019లో సెంచరీ సాధించాడు. కోల్ కతా నైట్ రైడర్స్ పై శతకం బాదాడు. ఆ తర్వాత కోహ్లీ ఇప్పటి వరకు సెంచరీ కొట్టలేదు. మొత్తానికి నాలుగేళ్ల తర్వాత కీలకమైన మ్యాచులో సెంచరీ సాధించి జట్టుకు మరుపురాని విజయాన్ని అందించాడు. ఐపీఎల్ లో ఒకే ఫ్రాంచైజీ తరపున  అత్యధిక సెంచరీలు(6) చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డులకెక్కాడు. కోహ్లీ చేసిన 6 సెంచరీలు  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫునే చేయడం విశేషం. 

మరోవైపు ఐపీఎల్ లో 6 సీజన్లలో 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. తొలిసారిగా 2011 ఐపీఎల్  లో   557 పరుగులు చేసిన కోహ్లీ... ఆ తర్వాత 2013లో 634 పరుగులు, 2015లో 505 పరుగులు, 2016లో  973 పరుగులు, 2018లో  530 పరుగులు కొట్ాటడు. ఐపీఎల్-16లో ఇప్పటివరకు 13 మ్యాచులాడిన కోహ్లీ 538 పరుగులతో కొనసాగుతున్నాడు. ఇందులో 6 అర్థసెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. అయితే కోహ్లీ 2022 సీజన్ లో అత్యంత చెత్త ప్రదర్శన చేశాడు. ఆ సీజన్ లో 16 మ్యాచుల్లో కేవలం   341 పరుగులు చేశాడు.

ఐపీఎల్ రెండో ఇన్నింగ్స్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గానూ కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఇక ఉప్పల్ లో  బెంగుళూరు రెండు సార్లు మాత్రమే గెలిచింది. ఈ రెండిటిలోనూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా కోహ్లీనే  నిలిచాడు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో కోహ్లీకి మెరుగైన రికార్డు ఉంది. ఈ స్టేడియంలో కోహ్లీ 12 టీ-20లు ఆడాడు.  ఏకంగా 59.2 సగటుతో  592 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 100.