ఆ టోర్నీలన్నీ గెలిచే సత్తా టీమిండియాకు ఉంది

ఆ టోర్నీలన్నీ గెలిచే సత్తా టీమిండియాకు ఉంది

టీమిండియాపై లారా ప్రశంసలు

న్యూఢిల్లీ: విరాట్‌‌ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియాకు ఐసీసీ టోర్నీలన్నీ గెలిచే సత్తా ఉందని విండీస్‌‌ బ్యాటింగ్‌‌ లెజెండ్‌‌ బ్రియాన్‌‌ లారా ఆన్నాడు. ‘ప్రస్తుతం ఇండియా టీమ్‌‌ చాలా బలంగా ఉంది. ఆడే ప్రతి టోర్నీని గెలిచే సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. అందుకే ప్రతి ఒక్కరికీ టీమిండియా టార్గెట్‌‌గా మారింది. ఇది అభినందించదగ్గ విషయం. ఏదో ఓ దశలో ఇండియాపై పోటీపడాల్సి ఉంటుందని ప్రతి టీమ్‌‌కు తెలుసు. అది క్వార్టర్స్‌‌, సెమీస్‌‌, ఫైనల్‌‌.. ఏదైనా కావొచ్చు. అందుకే గెలిచి తీరాలని ప్రతి ఒక్కరూ చాలా పట్టుదలగా ఉంటారు’ అని లారా పేర్కొన్నాడు. కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా టెస్ట్‌‌, వన్డేల్లో అత్యున్నత శిఖరాలకు చేరినా.. ఐసీసీ ట్రోఫీలను మాత్రం గెలవలేకపోయింది. కీలక మ్యాచ్‌‌ల్లో ఒత్తిడిని జయించలేక చతికిలపడుతూ వస్తోంది. చివరిసారిగా 2013లో ధోనీ సారథ్యంలోని ఇండియా టీమ్‌‌ ఐసీసీ చాంపియన్స్‌‌ ట్రోఫీని గెలిచింది. ఆ తర్వాత జరిగిన ఏ టోర్నీలోనూ టైటిల్‌‌ను నెగ్గలేదు. టెస్ట్‌‌ల్లో తన పేరుమీద ఉన్న హయ్యెస్ట్‌‌ రన్స్‌‌ (400 నాటౌట్‌‌) రికార్డును అధిగమించే సత్తా కోహ్లీ, వార్నర్‌‌, రోహిత్‌‌ శర్మకు ఉందని లారా చెప్పాడు. ‘ఈ రికార్డును బ్రేక్‌‌ చేయడం స్మిత్‌‌కు సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే అతను నాలుగో నంబర్‌‌లో బ్యాటింగ్‌‌కు వస్తున్నాడు. స్మిత్‌‌ గ్రేట్‌‌ ప్లేయరే అయినా ఆధిపత్యం చూపే శక్తి లేదు. అదే వార్నర్‌‌ దూకుడుతోపాటు ఆధిపత్యం చూపెడతాడు. కోహ్లీలో దూకుడు మరింత ఎక్కువగా ఉంటుంది. తనదైన రోజున రోహిత్‌‌ ఎవరికీ అందడు. కాబట్టి ఈ ముగ్గురికీ రికార్డు బ్రేక్‌‌ చేసే చాన్స్‌‌ ఉంది’ అని ఈ కరీబియన్‌‌ వ్యాఖ్యానించాడు.

'Virat Kohli-led India capable of winning all ICC tournaments': Former West Indies captain Brian Lara