న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీతో అదరగొట్టాడు. ఆదివారం (జనవరి 18) ఇండోర్ వేదికగా హోల్కర్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో 91 బంతుల్లో కోహ్లీ తన సెంచరీ మార్క్ అందుకున్నాడు. కోహ్లీ ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 2 సిక్సర్లున్నాయి. 40 ఓవర్ చివరి బంతికి సింగిల్ తీసుకొని విరాట్ వన్డే కెరీర్ లో 54వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జట్టు విజయం కోసం ఒంటరి పోరాటం చేస్తున్న కోహ్లీ టీమిండియాకు విజయం అందిస్తాడో లేదో ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికైతే మ్యాచ్ కివీస్ వైపే ఉంది.
338 పరుగుల ఛేజింగ్ లో రోహిత్ శర్మ ఔటైన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన కోహ్లీ ఆరంభం నుంచి దూకుడుగా ఆడాడు. ఒక ఎండ్ లో సహచరులు విఫలమవుతున్నా మరో ఎండ్ లో కోహ్లీ అలవోకగా పరుగులు రాబట్టాడు. 71 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి ఇండియా కష్టాల్లో పడింది. ఈ దశలో నితీష్ కుమార్ రెడ్డితో (53) కలిసి కోహ్లీ ఐదో వికెట్ కు 88 పరుగులు జోడించి ఆశలు సజీవంగా ఉంచాడు. అయితే స్వల్ప వ్యవధిలో నితీష్, జడేజా (12) ఔట్ కావడంతో ఇండియా పరాజయం ఖాయం అనుకున్నారు. ఈ దశలో హర్షిత్ రానాతో కలిసి కోహ్లీ మరో కీలక భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియా విజయం కోసం శ్రమిస్తున్నాడు.
ప్రస్తుతం ఇండియా 41 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. క్రీజ్ లో కోహ్లీ (103) హర్షిత్ రానా (29) ఉన్నారు. ఇండియా గెలవాలంటే చివరి 9 ఓవర్లలో 98 పరుగులు చేయాలి. ఈ మ్యాచ్ లో టీమిండియా ముందు ప్రత్యర్థి న్యూజిలాండ్ భారీ స్కోర్ సెట్ చేసింది. సూపర్ ఫామ్ లో డారిల్ మిచెల్ (137) సెంచరీతో చెలరేగగా.. గ్లెన్ ఫిలిప్స్ (106) కూడా శతకం బాదడంతో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. మిచెల్ 137 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
