ఒంటరిగా ఫీలయ్యా..డిప్రెషన్‌లోకి వెళ్లా

ఒంటరిగా ఫీలయ్యా..డిప్రెషన్‌లోకి వెళ్లా

న్యూఢిల్లీ: విరాట్‌‌‌‌ కోహ్లీ అంటేనే ఓ రన్‌‌ మెషీన్‌‌. వరల్డ్‌‌ బెస్ట్‌‌ బ్యాట్స్‌‌మెన్‌‌ లిస్ట్‌‌లో టాప్‌‌ ప్లేస్‌‌లో ఉండే కోహ్లీ పేరు చెబితే ఎంతటి బౌలరైనా భయపడాల్సిందే. పైగా, టీమిండియా కెప్టెన్‌‌ అవ్వడంతో ఎక్కడికెళ్లినా విపరీతమైన ఫాలోయింగ్‌‌. కెప్టెన్‌‌గా, ప్లేయర్‌‌గా ఇప్పటికే ఎంతో సక్సెస్‌‌ చూసిన కోహ్లీ.. ఓ సందర్భంలో డిప్రెషన్‌‌లోకి వెళ్లాడంటే నమ్మడం కాస్త కష్టమే. టీమ్‌‌ మెంబర్స్‌‌తోపాటు తన చుట్టూ చాలా మంది ఉన్నా.. ఎవ్వరూ లేని ఒంటరిగా ఫీలయ్యానని కోహ్లీ స్వయంగా చెప్పాడు.

2014 ఇంగ్లండ్‌‌ టూర్‌‌ సందర్భంగా ఈ సిచ్యువేషన్‌‌ను ఫేస్‌‌ చేశానని,  తన కెరీర్‌‌లోనే అది టఫ్‌‌ ఫేజ్‌‌ అని టీమిండియా కెప్టెన్‌‌  తెలిపాడు.  ‘నాట్‌‌ జస్ట్‌‌ క్రికెట్‌‌’ పేరుతో ఇంగ్లండ్‌‌ మాజీ ప్లేయర్‌‌ మార్క్‌‌ నికోల్స్‌‌ నిర్వహించిన పోడ్‌‌కాస్ట్‌‌లో కోహ్లీ శుక్రవారం పాల్గొన్నాడు. మీరు ఎప్పుడైనా డిప్రెషన్‌‌లోకి వెళ్లారా? అని మార్క్‌‌ అడిగిన ప్రశ్నకు అవునని బదులిచ్చిన విరాట్‌‌ తన అంతరంగాన్ని వివరించాడు. ‘అవును..నేను డిప్రెషన్‌‌లోకి వెళ్లా.  రన్స్‌‌ చేయడం నా వల్ల కావడం లేదు అనే ఫీలింగ్‌‌తో నిద్ర లేవడం చాలా కష్టంగా ఉంటుంది. నాకు తెలిసి ప్రతీ బ్యాట్స్‌‌మన్‌‌ ఏదో ఒక దశలో ఈ పరిస్థితిని ఎదుర్కొని ఉంటారు. ఏ అంశాన్ని కంట్రోల్‌‌ చేయలేని స్థితిని చూసుంటారు. ఆ సమస్యను ఎలా అధిగమించాలో అర్థం కాదు. ఆ సమయంలో  సిచ్యువేషన్‌‌ను కంట్రోల్లోకి తీసుకునేందుకు నేను ఏం చేయలేకపోయే వాడ్ని. నిజానికి ఏకాకిని అయ్యానేమో అనిపించేది. పెద్ద గ్రూప్‌‌తో ఉన్నప్పటికీ ఒంటరిగా ఉండటం అంటే ఏంటో ఆ దెబ్బకు  తెలిసొచ్చింది. అలాగని నా సమస్యను చెప్పుకునేందుకు ఎవ్వరూ లేరని కాదు. నేను ఉన్న మెంటల్‌‌ కండిషన్‌‌ను అర్థం చేసుకునే ప్రొఫెషనల్‌‌ ఉండుంటే మాత్రం పరిస్థితి వేరేలా ఉండేది. మెంటల్‌‌ ఇష్యూస్‌‌ను  తేలిగ్గా తీసుకోకూడదు.  ‘‘నాకు నిద్రపట్టడం లేదు, అసలు పొద్దున్నే నిద్ర లేవాలని అనిపించడం లేదు, నా మీద నాకు నమ్మకం పోయింది. ఏం చెయ్యాలో నాకేం అర్థం కావడంలేదు’’  స్థాయితో సంబంధం లేకుండా మన చుట్టూ ఉన్న చాలా మందిని ఇలాంటి ప్రశ్నలు వెంటాడుతుంటాయి.  కొందరు వీటిపై నెలలు తరబడి పోరాడితే ఇంకొందరు చాలా ఎక్కువ టైమ్‌‌ తీసుకుంటారు. కొంతమందికి ఓ క్రికెట్‌‌ సీజన్‌‌ అంతా పడుతుంది. ఎంత ట్రై చేసినా అందులోంచి ఎలా బయటికి రావాలో తెలుసుకోలేరు. అందుకే ఇలాంటి సందర్భాల్లో ప్రొఫెషనల్‌‌ హెల్ప్‌‌ కచ్చితంగా అవసరం అని బలంగా నమ్ముతున్నా’ అని విరాట్‌‌ కోహ్లీ చెప్పుకొచ్చాడు.

సచిన్‌‌ సూచనలు పనికొచ్చాయి..

మెంటల్‌‌ హెల్త్‌‌ ఇష్యూస్‌‌కు సంబంధించి క్రికెట్‌‌ లెజెండ్‌‌ సచిన్‌‌ టెండూల్కర్‌‌ ఇచ్చిన సలహా కూడా తనకు ఎంతో హెల్ప్‌‌ అయిందని టీమిండియా కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ చెప్పాడు. ‘ క్రికెట్‌‌కు సంబంధించి తనకున్న అనుభవంతో సచిన్​ నాకో సూచన చేశాడు. నెగెటివ్‌‌ ఫోర్స్‌‌ నిన్ను బలంగా వెనక్కి లాగుతున్నా.. పదేపదే నిన్ను ఇబ్బంది పెడుతున్నా పట్టించుకోవద్దని  సచిన్‌‌ చెప్పాడు. అలా కాకుండా దానిపై పోరాడితే ఆ సమస్య మరింత పెరుగుతుందన్నాడు. మాస్టర్‌‌ సూచనను  నేను పాటించా. ఆ తర్వాత నా మైండ్‌‌సెట్‌‌ చాలా మారింది’ అని కోహ్లీ అన్నాడు.

అనుష్క నా బలం..

మెంటల్​ ఇష్యూస్​తో ఇబ్బంది పడుతున్నప్పుడు తన భార్య అనుష్కశర్మతో వాటిని పంచుకుంటానని విరాట్‌‌‌‌ కోహ్లీ చెప్పాడు.  బాలీవుడ్‌‌ యాక్టర్‌‌ అయిన అనుష్క తన అనుభవంతో మెంటల్‌‌ ఇష్యూస్‌‌ను  బాగా డీల్‌‌ చేస్తోందని,  ఆమె తన బలమని టీమిండియా కెప్టెన్‌‌ తెలిపాడు.  ‘మెంటల్‌‌ హెల్త్‌‌ ఇష్యూస్‌‌ను డీల్‌‌ చేసే విషయంలో అనుష్క నా బలం. ఎందుకంటే ఆమె పర్సనల్‌‌గా ఎంతో నెగెటివిటీని చాలా బాగా హ్యాండిల్‌‌ చేసింది. ఆ అనుభవం వల్ల నా పరిస్థితిని కచ్చితంగా అర్ధం చేసుకుంటుంది. నేను కూడా  ఆమెను అర్థం చేసుకుంటాను. అనుష్క నా లైఫ్‌‌లో లేకపోతే ఇప్పుడున్నంత క్లారిటీతో ఉండేవాడినా? అంటే కచ్చితంగా చెప్పలేను’ అని కోహ్లీ చెప్పాడు.