విరాట్‌తో యుద్ధానికి వేచి చూస్తున్నా: అండర్సన్

విరాట్‌తో యుద్ధానికి వేచి చూస్తున్నా: అండర్సన్

న్యూఢిల్లీ: ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ పాక్‌తో టెస్టు సిరీస్‌లో 600 వికెట్ల మైలురాయిని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తాజా, మాజీ క్రికెటర్స్ అందరూ అండర్సన్‌కు విషెస్ చెప్పారు. ఈ విషయాన్ని పక్కన బెడితే తనకు బెస్ట్ బ్యాట్స్‌మన్‌ను ఎదుర్కోవడం ఇష్టమని అండర్సన్ అంటున్నాడు. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి సవాల్ విసరడం పసందుగా ఉంటుందన్నాడు. వచ్చే ఏడాది కోహ్లీ సారథ్యంలోని టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ సిరీస్‌లో విరాట్‌తో పోరు కోసం తాను ఉత్కంఠగా ఎదురు చూస్తున్నానని జిమ్మీ పేర్కొన్నాడు.

‘నాణ్యమైన బ్యాట్స్‌మన్‌కు బౌలింగ్ చేయడం ఎప్పుడూ కఠినంగానే ఉంటుంది. అది నిజంగా చాలా కఠినంగా ఉంటుంది. కానీ దాన్ని నేను ఆస్వాదిస్తా. బెస్ట్ ప్లేయర్స్‌ను ఔట్ చేయాలనే అనుకుంటాం. 2014 పర్యటన టైమ్‌లో కోహ్లీపై నేను గెలిచా. అయితే ఆ తర్వాత 2018లో విభిన్న ప్లేయర్‌‌గా అతడు తిరిగొచ్చాడు. అద్బుతంగా ఆడాడు కూడా. ఆ సమయంలో అతడు బంతులను వదిలేయడం నచ్చింది. 2014 సిరీస్‌లో నా స్వింగింగ్ బాల్స్‌ను వెంటాడుతూ కోహ్లీ త్వరగా నిష్క్రమించేవాడు. కానీ తర్వాతి పర్యటనలో అతడు బంతులను వదిలిన తీరు మెరుగ్గా ఉంది. అతడు చాలా క్రమశిక్షణతో కనిపించాడు. బాల్స్ వేసే దాకా వేచిచూసి తన కాళ్లను వేగంగా కదిలించడం ద్వారా సులువుగా రన్స్ చేసేవాడు. ఇండియాలో బౌలింగ్ చేయడాన్ని మేం ఎంజాయ్ చేశాం’ అని అండర్సన్ వివరించాడు.