పిచ్ గురించి అనవసర కామెంట్లు ఆపేసి.. డిఫెన్స్ టెక్నిక్స్ నేర్చుకోవాలి

పిచ్ గురించి అనవసర కామెంట్లు ఆపేసి.. డిఫెన్స్ టెక్నిక్స్ నేర్చుకోవాలి
  • ఎందుకీ రాద్ధాంతం!
  • స్పిన్‌‌ ట్రాక్స్‌‌పై అతిగా చర్చ వద్దు: కోహ్లీ

అహ్మదాబాద్‌‌: స్పిన్‌‌కు అనుకూలించే పిచ్‌‌ల గురించి అనవసర రాద్ధాంతం జరుగుతోందని టీమిండియా కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. ట్రాక్స్‌‌ గురించి మాట్లాడడం ఆపేసి, బ్యాట్స్‌‌మెన్‌‌ డిఫెన్స్‌‌ టెక్నిక్‌‌ మెరుగుపరుచుకోవాలని సూచించాడు.  ‘స్పిన్‌‌ ట్రాక్స్‌‌ గురించి అనవసర చర్చ జరుగుతూనే ఉంది.  నాలుగు లేదా ఐదో రోజు టెస్ట్‌‌ మ్యాచ్‌‌ పూర్తి అయితే ఎవ్వరూ ఏం మాట్లాడరు. ఇలా రెండ్రోజుల్లోనే ముగిస్తే ఎవరికి నచ్చిన కామెంట్స్‌‌ వాళ్లు చేసేస్తారు. వైట్‌‌ బాల్‌‌ క్రికెట్‌‌ ప్రభావం వల్ల టెస్టుల్లో వేగం పెరిగింది. అందరూ 300–350 రన్స్‌‌ చేయడంపైనే దృష్టి పెడుతున్నారు తప్ప.. నాలుగైదు సెషన్స్‌‌ ఎలా ఆడాలి అనే దాన్ని వదిలేశారు. ఈ క్రమంలో  డిఫెన్స్‌‌ అనే అంశాన్ని పూర్తిగా మరచిపోయారు.  అందరూ డిఫెన్స్‌‌ను మెరుగుపర్చుకోవాలి.  మేము ఓసారి న్యూజిలాండ్‌‌లో మూడో రోజు 36 ఓవర్లు ఆడి ఆలౌటైతే ఏ ఒక్కరూ పిచ్‌‌ గురించి మాట్లాడలేదు. పిచ్‌‌ల గురించి మేమెప్పుడూ ఫిర్యాదు  చెయ్యలేదు. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడేందుకే ప్రయత్నించాం. దాని వల్లే సక్సెస్‌‌ అవుతున్నాం. పిచ్‌‌, బాల్‌‌ కలర్‌‌ మీద నిందలు వేయడం కరెక్ట్ కాదు. ఓ జట్టు చెత్తగా ఆడితే తప్ప అన్ని మ్యాచ్‌‌లూ రెండ్రోజుల్లో పూర్తి కావు’ అని బుధవారం వర్చువల్‌‌ మీడియా కాన్ఫరెన్స్‌‌లో కోహ్లీ పేర్కొన్నాడు.

రొటేషన్‌‌ పాలసీ అవసరం

ఇంగ్లండ్‌‌ మాదిరిగా టీమిండియాకు కూడా రొటేషన్‌‌ పాలసీ కావాలని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ప్లేయర్లు బయో సెక్యూర్‌‌ ఎన్విరాన్‌‌మెంట్స్‌‌లో ఉంటూ ఆట కొనసాగించినన్ని రోజులూ ఫార్మాట్‌‌తో సంబంధం లేకుండా  రొటేషన్‌‌ పాలసీని అమలు చేయడం మంచిదన్నాడు. ప్లేయర్ల మెంటల్‌‌ హెల్త్‌‌కు ప్రాధాన్యమివ్వాలన్నాడు. అయితే, రిజర్వ్‌‌ బెంచ్‌‌ బలంగా ఉంటేనే రొటేషన్‌‌ సాధ్యమని చెప్పాడు  టీమిండియా బెంచ్‌‌ చాలా బలంగా ఉందన్న కోహ్లీ.. నాలుగైదేళ్ల వరకు టీమ్‌‌కు తిరుగులేదన్నాడు. సరైన కాంబినేషన్‌‌ ఎంచుకునే క్రమంలోనే కుల్దీప్‌‌ యాదవ్‌‌ను పక్కన పెట్టాల్సి వస్తోందని విరాట్‌‌ ఈ సందర్భంగా వెల్లడించాడు.