అతడితో మాట్లాడటం ఇష్టం: విరాట్ కోహ్లీ

అతడితో మాట్లాడటం ఇష్టం: విరాట్ కోహ్లీ

న్యూఢిల్లీ: ఆధునిక క్రికెట్ లో అద్భుతమైన బ్యాటింగ్ స్కిల్స్ తోపాటు టీమ్స్ ను ముందుండి నడిపించడంలోనూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ ఇద్దరూ ఇద్దరే. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం, ప్రత్యర్థుల నుంచి విజయాన్ని లాక్కోవడంలో వీరిద్దరిదీ అందె వేసిన చెయ్యి. గెలుపు కోసం ఇద్దరూ ఎంత శ్రమించడానికైనా సిద్ధంగా ఉంటారు. అయితే కోహ్లీ‌‌–విలియమ్సన్ వ్యక్తిత్తవాలు మాత్రం చాలా భిన్నం. క్రికెట్ ఆడే ప్రక్రియలో కోహ్లీ అగ్రెసివ్ గా ఉంటాడు. మిస్ ఫీల్డ్ అయినా, ఔటైనా, సెంచరీ బాదినా, మ్యాచ్ ఓడినా, గెలిచినా విభిన్న హావభావాలతో అగ్రెసివ్ నెస్ చూయిస్తాడు.. అదే విలియమ్సన్ మ్యాచ్ స్టాటిస్టిక్స్ తో సంబంధం లేకుండా కూల్ గా తన పని తాను చేసుకుపోతాడు. ప్రస్తుత క్రికెట్ లో భిన్న ధ్రువాల లాంటి ఈ ఇద్దరు క్రికెటర్స్ ఒక దగ్గర చేరితే ఎలా ఉంటుందనేది ఫ్యాన్స్ కల. అయితే వీరు ఒక జట్టుకు ఆడకపోయినా.. ఒకే దగ్గర చాలా సేపు కూర్చొని కబుర్లు చెప్పుకోవడం మాత్రం క్రికెట్ అభిమానులకు కొంత సంతోషాన్ని కలిగించింది.

కరోనా రావడానికి ముందు న్యూజిలాండ్ లో టీమిండియా పర్యటించింది. ఈ టూర్ లో భాగంగా ఐదో టీ20 మ్యాచ్ సందర్భంగా విరాట్, విలియమ్సన్ బౌండరీ లైన్ దగ్గర కొద్ది సేపు ముచ్చటించుకున్నారు. అప్పట్లో ఈ ఫొటో క్రికెట్ వరల్డ్ లో తెగ వైరల్ అయ్యింది. తాజాగా ఈ ఘటన గురించి కోహ్లీ పలు విషయాలు పంచుకున్నాడు. విలియమ్సన్ తో దిగిన ఓ ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన విరాట్.. ‘మా ముచ్చట్లను ఇష్టపడతా. గుడ్ మ్యాన్ (విలియమ్సన్ ను ఉద్దేశించి)’ అని రాసిన క్యాప్షన్ ను ఆ పోస్ట్ కు జత చేశాడు.

‘కేన్, నేను సిమిలర్ మైండ్ సెట్స్, ఫిలాసఫీస్ కలిగిన వాళ్లం. ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన వాళ్లం అయినప్పటికీ ఒకే తరహా ఆలోచనలు కలిగి ఉండటం అనేది అమేజింగ్. మేం ఒకేలా మాట్లాడతాం కూడా. స్కోర్ లైన్స్ ను పక్కనబెడితే.. న్యూజిలాండ్ క్రికెట్ మంచి చేతుల్లో ఉంది. టీమ్ ను నడిపించడానికి అతడే (విలియమ్సన్) సరైన వ్యక్తి. కేన్ పర్ఫెక్ట్ మ్యాన్. భవిష్యత్తులో కివీస్ ను ముందుకు తీసుకెళ్లాలని బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నా. కివీస్ తో ఆడటానికి అలాగే ఆ టీమ్ ఆడుతుంటే చూడటానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు’ అని కోహ్లీ చెప్పాడు.