సెహ్వాగ్‌ కాలర్ పట్టుకున్న తెల్లదొర ఎవరు? ఆరోజు ఏం జరిగింది?

సెహ్వాగ్‌ కాలర్ పట్టుకున్న తెల్లదొర ఎవరు? ఆరోజు ఏం జరిగింది?

వీరేంద్రుడు అంటేనే విధ్వంసానికి మారు పేరు. 1999లో వన్డేల ద్వారా జాతీయ జట్టులోకి అరంగ్రేటం చేసిన ఈ మాజీ డాషింగ్ ఓపెనర్.. 2001లో టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చారు. అప్పట్లో వీరూ అంటే బౌలర్లు హడలెత్తిపోయేవారు. ఔట్ చేయటం పక్కనపెడితే.. బంతి బౌండరీ వెళ్లకుండా ఉండటానికి ప్రణాళికలు రచించేవారు. అందుకే సాదా సీదా బౌలర్లు బౌలింగ్ వేయటానికి ముందుకొచ్చేవారు కాదు. అలాంటి ఈ గొప్ప మాజీ దిగ్గజాన్ని ఓ తెల్లదొర కాలర్ పట్టుకొని గుంజాడట. ఈ సంచలన నిజాన్ని అతనే స్వయంగా భయటపెట్టారు.

బీసీసీఐ మాజీ జనరల్ మేనేజర్ అమృత్ మాథుర్ రాసిన "పిచ్‌సైడ్: మై లైఫ్ ఇన్ ఇండియన్ క్రికెట్" పుస్తక ఆవిష్కరణలో సెహ్వాగ్ పాల్గొన్నారు. ఈ సంధర్బంగా మాట్లాడిన సెహ్వాగ్.. ఓ మ్యాచ్‌లో త్వరగా ఔటైనందు వల్ల అప్పటి హెడ్ కోచ్ జాన్ రైట్ కాలర్ లాగినట్లు తెలిపారు. ఆ సంఘటన జరిగిన వెంటనే తాను బీసీసీఐ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

సెహ్వాగ్‌ కాలర్ పట్టుకున్న జాన్ రైట్ 

నాట్‌వెస్ట్ సిరీస్‌లో భాగంగా ఓవల్ వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన లంకేయులు.. టీమిండియా ముందు 203 పరుగులు లక్ష్యాన్ని నిర్ధేశించారు. లక్ష్య చేధనకు భారత ఓపెనర్లు సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్ సిద్ధమవుతున్నారు. ఆ సమయంలో అప్పటి కోచ్ జాన్ రైట్.. సెహ్వాగ్ వద్దకు వచ్చి నువ్వు 40 ఓవర్లు బాటింగ్ చేసి హాఫ్ సెంచరీ చేసిన పర్లేదు కాని, ఔట్ కావొద్దని చెప్పాడట. 

కానీ సెహ్వాగ్‌కు అప్పట్లో పెద్దగా ఇంగ్లీష్ రాక‌పోవ‌డంతో అతను చెప్పింది అర్ధం కాలేదట. సరేనని తలూపాడట. ఆపై ఎప్పటిలానే దూకుడుగా ఆడే ప్రయత్నంలో 12 పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో వీరూ డ్రెస్సింగ్ రూమ్‌కి రాగానే కోచ్ జాన్ రైట్ కాలర్ పట్టుకొని కుర్చీలోకి విసిరేసాడట. నేను ఏం చెప్పాను? నువ్ ఏం చేశావ్? అంటూ గట్టిగా కసురుకున్నాడట. 

ఇది జరిగిన వెంటనే సెహ్వాగ్‌కు పట్టరాని కోపం వచ్చిందట. వెంటనే రాజీవ్ శుక్లా వద్దకు వెళ్లి ఈ తెల్లోడు ఏంటి? పెత్తనం చెలాయిస్తున్నాడని జరిగిన విషయాన్ని చెప్పాడట. మ్యాచ్ అనంతరం టీం మీటింగ్‌లో సచిన్ మాట్లాడుతూ.. జాన్ రైట్, సెహ్వాగ్ మధ్య ఏం జరిగిందో అది టీమ్‌ సభ్యుల వరకే ఉండాలని బయటికి చెప్పకూడదని చెప్పాడట. అయితే ఆయ‌న ప్ర‌వ‌ర్తించ‌డానికి గ‌ల కార‌ణం త‌ర్వాత అర్ధ‌మైందని సెహ్వాగ్ తాజాగా వెల్లడించారు.

కాగా, ఈ మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. ఏదేమైనా సెహ్వాగ్ చెప్పిన మాటలు క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చాక కూడా తెల్లోళ్లు పెత్తనం చెలాయించడాన్ని మండిపడుతున్నారు.