స్పేస్ టూర్ చేద్దామనుకుంటున్నారా? వర్జిన్ గెలాక్టిక్ టికెట్లు..

స్పేస్ టూర్ చేద్దామనుకుంటున్నారా? వర్జిన్ గెలాక్టిక్ టికెట్లు..

కాలిఫోర్నియా: అంతరిక్షానికి వెళ్లి భూమిని చూడటం ఒక ‘అద్భుతం’.. మన తెలుగమ్మాయి, ఇండియన్ అమెరికన్ ఆస్ట్రోనాట్ శిరీష బండ్ల గత నెల 11న వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ ప్లేన్‌లో రోదసి టూర్ చేసి వచ్చాక చెప్పిన మాటలివి!! ‘‘ఇంకా నేను అక్కడ ఉన్నట్లే ఉంది. కానీ ఇక్కడికి రావడంకూడా సంతోషమే. అంతరిక్షానికి వెళ్లి రావడం గురించి చెప్పాలంటే.. అద్భుతం అనే మాట కన్నా ఇంకా పెద్ద పదంకోసం వెతుకుతున్నా. పై నుంచి భూమిని చూడటం అనేది ఒక లైఫ్​ చేంజింగ్ ఎక్స్ పీరియెన్స్” అని నాడు శిరీష ఆనందాన్ని వ్యక్తంచేశారు. ఈ అనుభూతి పొందాలని ఎవరికి ఉండదు!! కానీ ఈ ఎక్స్‌పీరియన్స్ చాలా కాస్ట్‌లీ. సరదాగా ట్రిప్‌ వెళ్లినట్లుగా స్పేస్‌లోకి జాయ్ రైడ్ వెళ్లాలనుకునే సంపన్నులు ఈ టూర్ చేసి రావొచ్చు. భూమిపై నుంచి దాదాపు 80 కిలోమీటర్ల పైగా ఎత్తులోకి వెళ్లి జీరో గ్రావిటీని అనుభూతి పొందాలనుకునే వారి కోసం టికెట్లు అమ్మకం షురూ చేస్తున్నట్లు వర్జిన్ గెలాక్టిక్ కంపెనీ గురువారం ప్రకటించింది. ఈ టికెట్ ధర ఒక్కొక్కటి సుమారు రూ.3.33 కోట్లు (4.5 లక్షల డాలర్లు) అని తెలిపింది. స్పేస్‌ టూర్‌‌ లక్ష్యంగా 17 ఏండ్ల క్రితం ఈ కంపెనీని రిచర్డ్ బ్రాన్సన్ ప్రారంభించారు. జూన్‌లో ఈ కంపెనీకి యూఎస్ ఏవియేషన్ సేఫ్టీ రెగ్యులేటరీ అప్రోవల్ ఇవ్వడంతో గత నెల 11న రిచర్డ్ బ్రాన్సన్,  ఇండియన్ అమెరికన్ ఆస్ట్రోనాట్ శిరీష బండ్ల, మరో నలుగురు స్పేస్‌ జర్నీ చేశారు. తాజాగా పబ్లిక్‌ను కూడా స్పేస్ టూర్‌‌కు తీసుకెళ్లేందుకు సిద్ధపడిన ఆ కంపెనీ.. సింగిల్ సీట్, మల్టీ సీట్ ప్యాకేజీ, ఫుల్ ఫ్లైట్ బుకింగ్స్‌ను ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఫస్ట్ కమ్ ఫస్ట్ విధానంలో టికెట్లు అలాట్ చేస్తామని తెలిపింది. అయితే గతంలో టికెట్ రేటు సుమారు 1.80 కోట్లు ఉంటుందని చెప్పిన వర్జిన్ గెలాక్టిక్ ఇప్పుడు భారీగా పెంచేసింది.