కరోనా వస్తదేమోనని భయమైతంది!

కరోనా వస్తదేమోనని భయమైతంది!

గ్రేటర్ ఎలక్షన్ డ్యూటీ చేసిన ఉద్యోగుల్లో వైరస్ బుగులు

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ ఎన్నికల డ్యూటీ చేసిన ఉద్యోగులకు కరోనా భయం పట్టుకుంది. పోలింగ్, కౌంటింగ్ లో పాల్గొన్న వారిలో కొందరికి పాజిటివ్ వస్తుండడంతో తమకు కూడా కరోనా వస్తదేమోనని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఎప్పుడైనా ఎన్నికల డ్యూటీ, కౌంటింగ్ పూర్తయిన తర్వాత ప్రభుత్వం ఉద్యోగులకు 3 రోజులు ఎర్న్ డ్ లీవ్స్ ఇస్తుండేది. కానీ గ్రేటర్ ఎన్నికల తర్వాత ఈ విషయంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేతలు, కార్యకర్తలు వారం పాటు హోం క్వారంటైన్ లో ఉండాలని, అందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని పబ్లిక్ హైల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు ఈ నెల 3న సూచించారు. ఎన్నికల ప్రచారం, పెరిగిన చలి కారణంగా కేసులు పెరుగుతున్నాయన్నారు. ప్రచారంలో వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు పాల్గొనడం..  ప్రభుత్వ ఉద్యోగులు వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ కు వచ్చి డ్యూటీలు చేయడంతో కరోనా సోకే ప్రమాదం ఎక్కువ ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

పార్టీల నేతలు, పోలీసులకు పాజిటివ్

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఓ ఎమ్మెల్యే, ఓ ఎంపీ కొడుకు, నలుగురు కార్పొరేటర్లు, వారి కుటుంబీకులు, అధికారులకు కరోనా వచ్చినట్లు హెల్త్ ఆఫీసర్లు వెల్లడించారు. ఇక ఎలక్షన్ డ్యూటీ చేసిన ముగ్గురు పోలీసాఫీసర్లు, ఎస్ ఆర్ నగర్ పీఎస్ పరిధిలో ఆరుగురు సిబ్బందికి రెండోసారి కరోనా వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో పోలింగ్, కౌంటింగ్ లో పాల్గొన్న మిగతా ఉద్యోగులు భయపడుతున్నారు.  ఎన్నికల విధుల్లో పాల్గొన్న వారందరికీ కరోనా టెస్టులు చేయించాలని, నెగెటివ్ రిపోర్టు వస్తేనే డ్యూటీకి రానియ్యాలని ఉద్యోగులు కోరుతున్నారు.