ఇప్పటి స్టూడెంట్లకు అవకాశాలు అపారం: గడ్డం వంశీకృష్ణ

ఇప్పటి స్టూడెంట్లకు అవకాశాలు అపారం: గడ్డం వంశీకృష్ణ

 

  • లక్ష్యం పెట్టుకొని కష్టపడాలి
  • పరిమితులను అధిగమిస్తేనే రాణించగలం
  • గీతం వర్సిటీ ‘ప్రమాణ’ ఫెస్ట్​లో విశాక ఇండస్ట్రీస్​ జాయింట్ ఎండీ వంశీకృష్ణ
  • ప్రతిభకు లింగ భేదం లేదు: ఉపాసన

రామచంద్రాపురం, వెలుగు :  నేటి విద్యార్థులకు అపరిమిత అవకాశాలు ఉన్నాయని, లక్ష్యం పెట్టుకొని కష్టపడితే ఏదైనా సాధించవచ్చని విశాక ఇండస్ట్రీస్  జాయింట్ మేనేజింగ్  డైరెక్టర్​ గడ్డం వంశీకృష్ణ అన్నారు. పరిమితులను అధిగమిస్తేనే జీవితంలో రాణించగలమన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో నిర్వహించిన గీతం డీమ్డ్​ యూనివర్సిటీ  టెక్నో -కల్చరల్​ ఫెస్ట్​ ‘ప్రమాణ’ ఫెస్ట్ కు ఆయన ఆత్మీయ అతిథిగా హాజరయ్యారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఫెస్ట్​ను మరో ముఖ్య అతిథి, అపోలో హాస్పిటల్స్ (సీఎస్ఆర్) వైస్​ ప్రెసిడెంట్ ఉపాసనతో కలిసి ప్రారంభించారు. అనంతరం వంశీకృష్ణ మాట్లాడుతూ.. అభిరుచులు, ఆసక్తులకు అనుగుణంగా జీవితంలో రాణించాలన్నారు. ఎలక్ర్టికల్, మేనేజ్​మెంట్ నేపథ్యం ఉన్న తాను సోలార్​ ప్రొడక్ట్స్​ డెవలప్​మెంట్​ రంగంలో ఉన్న అభిరుచితో సోలార్​ రూఫ్​టాప్​లను రూపొందించి పేటెంట్ పొందానని తెలిపారు. 

అలాగే ఎలక్ట్రిక్​ వెహికల్స్​ రంగంలో ఉన్న ఆసక్తితో ఓ ఎలక్ట్రిక్​ బైక్​ను తయారు చేసి, దానిపైనా ఆరు పేటెంట్లు పొందానని చెప్పారు. క్రమశిక్షణ, ఆసక్తి, దృఢసంకల్పం మనిషిని విజయ తీరాల వైపు నడిపిస్తాయన్నారు. స్టూడెంట్స్​ అంతా తమకు ఏ ఫీల్డ్​లో ఇంట్రస్ట్​ ఉంటే అదే ఎంచుకోవాలని వంశీకృష్ణ సూచించారు. ఉపాసన మాట్లాడుతూ ప్రతిభకు లింగభేదం లేదని, ఉత్తమ ప్రదర్శనకు ఆడ, మగ అనే తేడా ప్రామాణికం కాదని అన్నారు. శక్తి సామర్థ్యాలతో విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ కూడా మారుతోందని, అందుకే కంప్యూటర్స్​ ఏఐ సైన్స్​ నేడు లీడ్​ రోల్​ ప్లే చేస్తున్నాయని చెప్పారు. కాగా,  మొదటి రోజు ఫెస్ట్​లో నిర్వహించిన వివిధ టెక్నో, కల్చరల్​  పోటీలు అలరించాయి. గీతం స్కూల్​ ఆఫ్  టెక్నాలజీ డైరెక్టర్​ ప్రొఫెసర్​ వీఆర్​ శాస్త్రి, ప్రమాణ అడ్వైజర్​ ప్రొఫెసర్​ త్రినాథరావు, వివిధ బ్రాంచ్​ల హెడ్​లు, గీతం స్టూడెంట్ లైఫ్​ అధికారులు పాల్గొన్నారు.