
ఓయూ,వెలుగు: అణగారిన వర్గాల విద్యార్థులు అగ్ర కుల రాజకీయ పార్టీలకు కీ ప్రెషర్ గ్రూప్ ఫోర్స్ కావొద్దని, ఒకవేళ అయితే వెనకబాటు తప్పదని ధర్మ సమాజ్ పార్టీ (డీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ సూచించారు. బీసీ ఎస్సీ, ఎస్టీ వర్గాల విద్యార్థులు స్వధర్మంతో 'రాజకీయ శక్తి'గా ఎదగాలని పేర్కొన్నారు. సోమవారం ఉస్మానియా యూనివర్సిటీలో పార్టీ స్టూడెంట్ వింగ్ ఆవిర్భావ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
వేల ఏళ్లుగా తరతరాలుగా బీసీ, ఎస్సీ, ఎస్టీలైన శూద్రులు విద్యలేక బానిసత్వంలోనే మగ్గిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బుద్ధుడు, సాహు, పూలే, అంబేద్కర్ సామాజిక, రాజకీయ ఉద్యమాలను నేడు కొనసాగించడం మర్చిపోయారన్నారు. రాజకీయాల్లో 10 శాతం ఉన్న అగ్రకులాల చేతిలోనుంచి 90 శాతం ఉన్న అణగారిన వర్గాల చేతుల్లోకి అధికారం తీసుకొద్దామన్నారు. కార్యక్రమంలో ఔటా ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ మల్లేశం, ప్రొఫెసర్చంద్రునాయక్, జ్ఞానేశ్వర్, శంకరయ్య, డీఎస్పీ స్టూడెంట్ వింగ్ స్టేట్ అడ్వైజర్ కార్తీక్ మహరాజ్, హరప్ప తదితరులు పాల్గొన్నారు.