విష్ణు, నేను కలిసి పనిచేశాం.. ఆయనకు పార్టీలో సముచిత స్థానం ఇస్తం : హరీశ్​రావు

విష్ణు, నేను కలిసి పనిచేశాం.. ఆయనకు పార్టీలో సముచిత స్థానం ఇస్తం : హరీశ్​రావు

ఖైరతాబాద్, వెలుగు: పీజేఆర్ అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే పీజేఆర్ అని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆ రోజుల్లో సీఎల్పీ నేతగా పి.జనార్దన్ రెడ్డి(పీజేఆర్) ఎంత కష్టపడ్డారో అందరికీ తెలిసిందేనన్నారు. జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్ధన్ రెడ్డిని బీఆర్ఎస్​లోకి ఆహ్వానించేందుకు సోమవారం దోమలగూడలోని ఆయన ఇంటికి మంత్రి హరీశ్​రావు వెళ్లారు. సుమారు 20 నిమిషాల పాటు విష్ణు వర్ధన్ రెడ్డితో చర్చలు జరిపారు. అనంతరం హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం కాంగ్రెస్​పార్టీ కొన్ని ముఠాల చేతిలోకి వెళ్లిపోయిందని విష్ణు ఆవేదన వ్యక్తం చేశారని మంత్రి తెలిపారు. ‘2009–14 ’ సమయంలో విష్ణు అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా తెలంగాణ ఉద్యమంలో అసెంబ్లీలో ఇద్దరం కలిసి పనిచేశామని, ఆయనకు బీఆర్ఎస్​ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని, అందుకు ఆయన అంగీకరించారని అన్నారు.

కాంగ్రెస్ అన్యాయం చేస్తుందనుకోలేదు: విష్ణువర్ధన్ రెడ్డి

కాంగ్రెస్​ పార్టీ ఇంత అన్యాయం చేస్తుందని కలలో కూడా అనుకోలేదని విష్ణువర్దన్​ రెడ్డి అన్నారు. కింది స్థాయి కార్యకర్తలు బాగానే ఉన్నారని, పైవాడు అమ్ముడు పోయాడని, ఇలాంటి పరిస్థతి వస్తుందని కలలో ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మా రక్తంలోనే కాంగ్రెస్​ఉంది. 35 ఏండ్లు మా నాన్న పార్టీలో పనిచేస్తే, నేను17 ఏండ్లు పనిచేశా. ప్రస్తుత కాంగ్రెస్​లీడర్లు గాంధీభవన్​అమ్మేస్తారు. ఇలాంటి వాళ్లకి రాష్ట్రాన్ని అప్పగిస్తే  చైనాకో అమెరికాకో అమ్మేస్తారు”అని విష్టువర్దన్​రెడ్డి ఆరోపించారు. తొందరలోనే పార్టీలో చేరతానని వెల్లడించారు.